సాక్షి డిజిటల్ న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం (డిసెంబర్ 12) రోజున సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలలో 2027 జనాభా లెక్కలకు సంబంధించిన అంశం కూడా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం (డిసెంబర్ 12) రోజున సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆమోదాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలలో 2027 జనాభా లెక్కలకు సంబంధించిన అంశం కూడా ఉంది. 2027 జనాభా లెక్కల కోసం 11,718 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ వివరాలను అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ… 2027 జనాభా లెక్కలను రెండు దశల్లో నిర్వహిస్తామని చెప్పారు. భారత్‌లో నిర్వహించనున్న ఈ జనాభా లెక్కలు 16వది అని… స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చేపడుతున్న 8వ జనగణన అని తెలిపారు. భారతదేశ జనాభా లెక్కలను ప్రపంచంలోనే అతిపెద్ద పరిపాలనా, గణాంక ప్రక్రియగా పరిగణిస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. కుల గణనను జనాభా లెక్కల సేకరణ 2027లో చేర్చనున్నామని చెప్పారు. ఇక, 2025 ఏప్రిల్ 30న జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో రాబోయే జనాభా లెక్కల్లో అంటే 2027 జనాభా లెక్కింపులో కుల గణనను చేర్చాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తదుపరి జనాభా లెక్కల్లో కులగణనను కూడా చేర్చుతున్నారు. అయితే దేశంలో మొట్టమొదటి సారిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ చేపడుతున్నట్టుగా అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వెర్షన్‌లకు అందుబాటులో ఉండే మొబైల్ అప్లికేషన్‌లను ఉపయోగించి డేటాను సేకరిస్తారని చెప్పారు. జనాభా లెక్కల సేకరణలో క్షేత్రస్థాయిలో 30 లక్షల మంది సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన ఎన్యూమరేటర్లు(సాధారణంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు) వారి సాధారణ విధులతో పాటు జనాభా లెక్కల క్షేత్రస్థాయి పనిని చేస్తారు.