సాక్షి డిజిటల్ న్యూస్ తెలంగాణలో బీఆర్ఎస్ కూడా బౌన్స్ బ్యాక్ అవుతుంది అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు. అఖిలేష్ యాదవ్ స్ఫూర్తితో తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎప్పుడు కలిసినా చాలా ఆప్యాయంగా, సొంత మనిషిలా అనిపిస్తుంది అని సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కలుస్తానని…బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎప్పుడూ గౌరవంతో స్వాగతం పలికారని అన్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయని…రాజకీయాల్లో ప్రజలు ఒక్కోసారి స్వీకరిస్తారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమావేశమయ్యారు. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన అఖిలేష్‌కు కేటీఆర్, హరీశ్‌రావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు త్వరలో మారుతాయని…నిరంతరం ప్రజల వెంట ఉంటే బీఆర్ఎస్కు తిరిగి అవకాశం ఇస్తారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ ప్రజల ఆలోచనలో మార్పు వస్తుంది: అఖిలేష్ యాదవ్ తెలంగాణ ప్రజలు త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడతారని అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడితే, ప్రజలు తప్పకుండా అండగా ఉంటారని అఖిలేశ్ యాదవ్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లిన అఖిలేష్ యాదవ్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం అఖలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో జయాపజయాలు సహజమని… ఒక్కోసారి ప్రజలు మన పనితీరును, విధానాలను పునఃసమీక్షించుకునే అవకాశాన్ని ఓటమి ద్వారా కల్పిస్తారని చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ ప్రస్థానాన్ని ఉదహరిస్తూ గతంలో తాము కూడా చాలా తక్కువ సీట్లు గెలిచామని… కానీ ప్రజలు తమ వెంటే నిలిచారని గుర్తు చేశారు.ప్రజల మద్దతుతోనే యూపీలో బీజేపీని రెండో స్థానానికి నెట్టి 37 మంది ఎంపీలతో లోక్‌సభలో బలంగా ఉన్నామని వ్యాఖ్యానించారు.ఖచ్చితంగా తెలంగాణలోనూ ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని అఖిలేష్ యాదవ్ చెప్పుకొచ్చారు.