తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో విచిత్రం

★చనిపోయిన అభ్యర్థి సర్పంచ్‌గా విజయం

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలివిడత సర్పంచ్ ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో మరణించిన అభ్యర్థి చెర్ల మురళి గెలుపొందారు. గుండెపోటుతో మరణించిన చెర్ల మురళికి పట్టం కట్టారు. గురువారం జరిగిన ఎన్నికల్లో చనిపోయిన సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి 358 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో 84.28 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88 శాతం, అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడం జిల్లా 71.79 శాతంగా పోలింగ్ నమోదు అయ్యింది. తొలి విడతలో మొత్తం 45,15,141 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.ఇకపోతే తొలివిడతలో 396 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా 9,644 వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవం అయ్యారు. ఇకపోతే ఈ పంచాయతీ ఎన్నికల్లో పలు సిత్రాలు చోటు చేసుకున్నాయి. చనిపోయిన అభ్యర్థికి ఓటర్లు పట్టంకట్టగా మరో పంచాయతీలో మృతి చెందిన అభ్యర్థికి ఓట్లు వేసి తమ అభిమానాన్ని చాటుకోవడం సంచలనంగా మారింది. మృతి చెందిన వ్యక్తికి పట్టం తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి.రాజకీయాల్లో మనిషి చనిపోయినా కూడా ఆయన చేసిన పనులు బతికే ఉంటాయి అని అందరూ అంటూ ఉంటాం. కానీ పంచాయతీ ఎన్నికల్లో బతికి ఉన్నప్పుడు ప్రజల మనసు గెలుచుకున్న ఓ వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఎన్నికల్లో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అరుదైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలంలోని చింతలతాన పంచాయతీలో జరిగింది.తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చింతలతాన పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా చెర్ల మురళి (50) నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ వేసిన అనంతరం ఆయన మరణించారు. నేడు జరిగిన పోలింగ్‌లో ఓటర్లు ఆయనకు పట్టంకట్టడం విశేషం.