
జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర అనే యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. మనమిత్రతో విస్తృత ప్రయోజనాలు లభిస్తాయి అని చెప్పుకొచ్చారు. మనమిత్ర వాట్సాప్ ద్వారా 1200కు పైగా సేవలు అందిస్తామని. ఇప్పటికే 800కు పైగా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. జనవరి 15 నుంచి అన్నిసేవలూ ఆన్‌లైన్, వాట్సాప్‌లోనే అందించాలన్నది లక్ష్యం అని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రభుత్వ శాఖలు, ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా విప్లవాత్మక ఫలితాలు పొందవచ్చని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని ప్రశ్నించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతుల సమావేశంలో ఆయన డేటా డ్రివన్ గవర్నెన్స్‌పైన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రజలకు అన్ని రకాల ప్రభుత్వ సేవలను మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలనేది ప్రభుత్వ ఆశయమని. ఇప్పటికే ఆ దిశగా చర్యలు తీసకున్నామని అన్నారు.ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 800కుపైగా సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ 380 రకాల సేవలను వివిధ శాఖలు ఆన్‌లైన్‌లో అందించకుండా మ్యాన్యువల్‌గా అందిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈ సేవలన్నీ కూడా వెంటనే ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ శాఖాధిపతులను కోరారు. జనవరి 15 తేదీలోగా అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే జనవరి 15వ తేదీ తర్వాత అన్ని సేవలు ఆన్‌లైన్, వాట్సాప్‌గవర్నెన్స్ ద్వారా అందించాలనే లక్ష్యానికి అనుగుణంగా ఆయా శాఖలు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ సేవలు కూడా ఆన్‌లైన్‌లోకి వస్తే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దాదాపు 1200 రకాల సేవలు పౌరులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రజలెవ్వరూ కూడా తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు రానవసరం లేకుండా కేవలం తమ ఇంటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందే వీలు కలుగుతుందని చెప్పారు. మనమిత్ర కేవలం పౌరులకే కాకుండా, ప్రభుత్వంలోని ఆయా శాఖలు కూడా తమ పనితీరును మరింత సులభతరం చేసుకోవచ్చని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పుడు ప్రభుత్వంలో అతి పెద్ద కమ్యూనికేషన్ ప్లాట్‌ఫాంగా ఏర్పాటు చేశామని, ప్రభుత్వ శాఖలు తాము ప్రజలకు చేరవేయదలచుకున్న సమాచారాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా రియల్ టైమ్‌లో ఎంతమందికైనా చేరవేయొచ్చని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. డిజీ వెరిఫికేషన్ ధృవ పత్రాల వెరిఫికేషన్ ప్రక్రియను కూడా ఇప్పుడు టెక్నాలజీ సాయంతో సులభతరం చేశామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఇందుకోసం ఆర్టీజీఎస్ ప్రత్యేకంగా డిజీ వెరిఫై సదుపాయాన్ని అందజేస్తోందన్నారు. ఆయా శాఖలు విద్యార్థులు, ప్రజలు ఎవరైనా వారు సమర్పించే సర్టిఫికెట్లను డిజీ వెరిఫై ద్వారా అవి అసలైనవో, కావో ఇట్టే క్షణాల్లో తెలుసుకోవచ్చన్నారు. ఏపీపీఎస్సీ లాంటి సంస్థలకైతే ఉద్యోగాల నియామక ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే సర్టిఫికెట్లను ఫిజికల్‌గా తనిఖీ చేయడానికే చాలా సమయం పడుతోందన్నారు. ఇప్పుడు డిజీ వెరిఫై ద్వారా ఇట్టే క్షణాల్లో సర్టిఫికెట్లు అసలైనవా నకిలీవా అనేది తెలుసుకోవచ్చని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఈ సదుపాయాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.