
పయనించే సూర్యుడు న్యూస్ : ఇండి కూటమిలోని పార్టీలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూడో సెక్యులరిజం పేరుతో న్యాయవ్యవస్థను బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. ఇండి కూటమిలోని పార్టీలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూడో సెక్యులరిజం పేరుతో న్యాయవ్యవస్థను బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్‌ను తొలగించాలని కోరుతూ డీఎంకె నాయకురాలు కనిమొళి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అభిశంసన నోటీసును సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యారు. ఈ నోటీసుపై 120 మంది ఎంపీలు సంతకాలు చేశారు. అయితే ఈ పరిణామాలపై పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గతంలో శబరిమల అంశంపై శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక పవిత్రమైన ఆచారాన్ని రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే, ఆ న్యాయమూర్తులను తొలగించాలని రాజకీయంగా ఒత్తిడి చేయలేదని అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం విపక్షాలు హిందూ మతానికి చెందిన స్థలంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న కార్తీక దీపం వెలిగించే ఆచారాన్ని కొనసాగించేందుకు భక్తుల హక్కును సమర్థిస్తూ తీర్పు ఇచ్చినందుకు ఒక విధుల్లో ఉన్న హైకోర్టు న్యాయమూర్తినే లక్ష్యంగా చేసుకున్నాయని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ‘‘రాజ్యాంగబద్ధమైన సుప్రీం కోర్టు ధర్మాసనం శబరిమల అంశంపై శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక పవిత్రమైన ఆచారాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇస్తే దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున నిరసనలను తెలిపారు. కానీ ఎవరూ కూడా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానం చేయలేదు. అత్యంత పవిత్రమైన హిందూ క్షేత్రాల్లో ఒకటైన శబరిమలలోని ప్రధాన ఆచార మార్పు అంశంపై ఇచ్చిన తీర్పుపై కేవలం రివ్యూ పిటిషన్‌లు మాత్రమే దాఖలయ్యాయి... రాజకీయంగా వారిని (న్యాయమూర్తులను) తొలగించాలని ఒత్తిడి చేయలేదు. ఇటీవల ఒక సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి “ఓహో! ఇప్పుడు దేవుడినే అడిగి ఏదైనా చేయమని చెప్పండి. మీరు విష్ణుభక్తుడని చెబుతున్నారా? అయితే వెళ్లి ప్రార్థించండి’’ అని బహిరంగంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఆయన ఏ చర్య తీసుకోలేదు. కనీసం ఆయనను క్షమాపణ కోరలేదు, తొలగించాలని ప్రయత్నించలేదు. అంతేకాదు ఆయనపై ఒక న్యాయవాది దుర్భాషలాడినప్పుడు అన్ని రాజకీయ పార్టీలూ వెంటనే ఆ న్యాయమూర్తి గౌరవాన్ని కాపాడేందుకు ముక్తకంఠంతో ఖండించాయి. కానీ ఈరోజు పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. హిందూ మతానికి చెందిన స్థలంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న కార్తీక దీపం వెలిగించే ఆచారాన్ని కొనసాగించేందుకు భక్తుల హక్కును సమర్థిస్తూ తీర్పు ఇచ్చినందుకు ఒక విధుల్లో ఉన్న హైకోర్టు న్యాయమూర్తినే లక్ష్యంగా చేసుకున్నారు. అయితే భారత రాజ్యాంగం స్పష్టంగా ఒక న్యాయమూర్తిని తొలగించడానికి అతను "అసభ్యకరంగా వ్యవహరించడం" లేదా “అసమర్థత” మాత్రమే కారణాలై ఉండాలని చెబుతోంది కానీ డీఎంకే ఆధ్వర్యంలోని ఇండి కూటమికి చెందిన 120మందికి పైగా ఎంపీలు రాజ్యాంగాన్నే ఆయుధంగా చేసుకుని ఆ న్యాయమూర్తిపై అభిశంసన నోటీసు ఇచ్చారు. ఇది న్యాయపాలనపై జవాబుదారీతనం కాదు, ఇది బహిరంగ రాజకీయ బెదిరింపు. హిందూ భక్తుల హక్కులను కాపాడుతూ తీర్పు ఇచ్చినందుకు ఇలా ఒక న్యాయమూర్తిని అభిశంసించడానికి ఎందుకు అంత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి?. ఇది న్యాయవ్యవస్థ మొత్తాన్ని భయపెట్టే యత్నం కాదా? హిందూ సంప్రదాయాలు, ఆచారాలపై తీర్పు ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న పరోక్ష సందేశం కాదా? ఇలాంటి సందర్భంలో భక్తులు తమ దేవాలయాలను, తమ మత వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించేందుకు... రాజకీయ జోక్యం లేకుండా, రాజకీయ ద్వేషంతో ప్రేరితమైన న్యాయ దుర్వినియోగాలకు గురవకుండా ఉండేందుకు సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటే దేశానికి అత్యవసరం. చివరిగా హిందువులు తమ మతాచారాలను ఆచరించడం కూడా భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు అని దేశంలోని స్వయం ప్రకటిత మేధావులకు, ముఖ్యంగా సూడో సెక్యులర్లకు స్పష్టం చేస్తున్నాను. అలాగే సనాతన ధర్మాన్ని ఆచరించడం అంటే ఇతర మతాలకు వ్యతిరేకమని కాదు. సెక్యులరిజం రెండువైపులా నడవాలి. ఒకవైపే నడిస్తే అది సెక్యులరిజం కాదు, అది సెలెక్టివ్ సూడో సెక్యులరిజం. ప్రతి మతాన్నీ సమాన గౌరవంతో చూడాలి. అందులో హిందువులు కూడా ఉన్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.