ఏపీ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తెలంగాణ

★ ఏపీ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తెలంగాణ సరిహద్దులకు సమీపంలో కొత్త ఫార్మా హబ్, ఏపీకి క్యూ కడుతున్న కంపెనీలు!

జనం న్యూస్ : తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ఫార్మా సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫార్మా కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే సిగాచీ ఇండస్ట్రీస్, విరూపాక్ష ఆర్గానిక్స్ వంటి ఫార్మా కంపెనీలు ఏపీలో తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు సిద్ధమయ్యాయి. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో ఈ సంస్థలకు ఏపీ ప్రభుత్వం భూమి కేటాయించింది. ఈ రెండు సంస్థల ద్వారా దాదాపు 3000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ఫార్మాసిటీని కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఫార్మాసిటీకి నిర్దేశించిన ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో హైదారాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫార్మా కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. అందులో ప్రధానంగా సిగాచీ ఇండస్ట్రీస్, విరూపాక్ష ఆర్గానిక్స్.. ఏపీలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్‌కు చేరువులో, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నందున ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాయి. కాగా ఇప్పటికే విరూపాక్ష ఆర్గానిక్స్ కంపెనీకి.. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో 120 ఎకరాల భూమిని కేటాయించారు. ఇక్కడ ఈ కంపెనీ ఫార్మాస్యూటికల్స్, ఆర్గానిక్ కెమికల్స్‌ను ఉత్పత్తి చేయడానికి రూ. 1,225 కోట్లతో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. తద్వారా 1500 మంది ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ చెబుతోంది. మరోవైపు, సిగాచీ ఇండస్ట్రీస్‌కు కూడా ఓర్వకల్లులో 100 ఎకరాల భూమిని కేటాయించింది ఏపీ ప్రభుత్వం. దీంతో రూ. 1,090 కోట్ల పెట్టుబడితో సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్ తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు సిద్ధమైంది. ఈ కంపెనీ ద్వారా 1500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. హైదరాబాద్ సమీపంలోని పాశమైలారంలో ఉన్న సిగాచీ పరిశ్రమలో ఈ ఏడాది జూన్‌లో రియాక్టర్ పేలుడు సంభవించి సుమారు 50 మందికి పైగా కార్మికులు మృతి చెందారు. 33 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన తెలంగాణ చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదంగా నిలిచింది. దీంతో ఈ కంపెనీపై తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షణ ఎక్కువైంది. ఇప్పటికే విరూపాక్ష ఆర్గానిక్స్ కంపెనీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషనల్ బోర్డు (SIPB) అనుమతి ఇచ్చింది. వారంలో రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదించే అవకాశం ఉంది. కాగా, తెలంగాణలో ఫార్మా సిటీ రద్దుతో రెడ్ కేటగిరీ పరిశ్రమలకు భూములు లేకపోవడం వల్లే.. ఈ కంపెనీలు పెట్టుబడులను ఏపీకి తరలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. రంగరెడ్డి జిల్లాలోని ముచ్చెర్ల ప్రాంతంలో 19 వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్ చేయాలని ప్రణాళికలు రూపొందించింది. కానీ 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీని రద్దు చేసింది. హకీంపేట, పోలేపల్లి, లగచెర్లలో భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ కూడా వెనక్కి తీసుకుంది. పెద్ద డ్రగ్ పార్క్ బదులు చిన్న ఫార్మా విలేజ్‌లను నిర్మించాలని ప్రతిపాదించింది. అయితే ఈ ఫార్మా విలేజ్‌లు తెలంగాణలో ఏర్పాటు అయ్యే లోపే.. ఓర్వకల్లులోని పారిశ్రామిక పార్కులో భూములు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఫార్మాకంపెనీలు ఏపీ వైపు చూస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.