పయనించే సూర్యుడు న్యూస్ : లోక్‌సభలో వందేమాతరంపై జరుగుతున్న చారిత్రక చర్చను ప్రారంభిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం పూర్తి చేసిన చారిత్రక ఘట్టాలను గుర్తుచేస్తూ.. “వందేమాతరం 50 ఏళ్లు నిండినప్పుడు దేశం వలస పాలన కింద ఉంది. దానికి 100 ఏళ్లు నిండినప్పుడు దేశం ఎమర్జెన్సీ చీకటి కాలంలో ఉంది” అని ప్రధాని అన్నారు. లక్షలాది మంది ఈ గీతాన్ని ఆలపించి పోరాడడం వల్లే నేడు మనం పార్లమెంట్‌లో కూర్చోగలిగామని తెలిపారు. లోక్‌సభలో ఈ చర్చను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ‘వందేమాతరం మంత్రం’ స్వాతంత్ర్య సమరంలో యావత్ దేశ ప్రజలకు శక్తిని, ప్రేరణను ఇచ్చిందని కొనియాడారు. ముఖ్యంగా ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు దేశ ప్రజలందరినీ ఒకతాటిపైకి తీసుకు వచ్చిందని మోదీ అన్నారు. ఈ చర్చ కోసం దిగువ సభలో 10 గంటల సమయాన్ని కేటాయించారు. “వందేమాతరం 150వ చారిత్రక ఘట్టానికి మనం సాక్షులుగా నిలిచాం. దేశం సర్దార్ పటేల్, బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను కూడా జరుపుకుంటోంది. ఈ చర్చ సభ నిబద్ధతను తెలియజేయడంతో పాటు భావితరాలకు కూడా ఉపయోగపడుతుందని చెబుతోంది” అని ప్రధాని మోదీ తెలిపారు. వందేమాతరం రచించినప్పుడు భారత్ బానిసత్వంలో ఉందని.. దానికి వంద సంవత్సరాలు పూర్తయినప్పుడు దేశంలో రాజ్యాంగం గొంతు నొక్కేసిన చీకటి కాలం (ఎమర్జెన్సీ) నడిచిందని గుర్తు చేశారు. ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నామంటే.. లక్షలాది మంది వందేమాతరం ఆలపించడంతోనే సాధ్యమైందని ఆయన తెలిపారు. బ్రిటీష్ పాలకులు ‘గాడ్ సేవ్ ద క్వీన్’ అనే గీతాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో.. బంకించంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని రచించారని మోదీ గుర్తు చేశారు 2047 నాటికి దేశాన్ని ఆత్మనిర్భరంగా, అభివృద్ధి చెందిన దేశంగా మార్చే సంకల్పాన్ని పునరుద్ఘాటించాలని కోరారు. విపక్ష కాంగ్రెస్ తరపున లోక్‌సభలో పార్టీ ఉప నేత గౌరవ్ గొగొయ్, ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా తదితరులు పాల్గొననున్నారు.