
జనం న్యూస్ : గత ప్రభుత్వకాలంలో జరిగిన ఆర్థిక అవ్యవస్థలను గుర్తుచేస్తూ, అప్పులు తెచ్చుకోవడానికి ఆస్తులను, భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) పురోగతిని సమీక్షిస్తూ, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, పెరుగుతున్న పెట్టుబడులు, పునరుద్ధరించిన పథకాల గురించి వివరించారు. విపరీతంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని, “జరిగే పనులకు మేము బాధ్యత వహిస్తున్నాం. చేయలేమని చెప్పి పారిపోము” అని స్పష్టం చేశారు. నిలిచిపోయిన 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను మళ్లీ ప్రారంభించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. విద్యుత్ రంగంలో గతంలో జరిగిన తప్పిదాలను ప్రస్తావిస్తూ పీక్ అవర్ సమయంలో యూనిట్‌కు రూ. 15 చొప్పున విద్యుత్ కొనాల్సి వచ్చిందని, రద్దు చేసిన విద్యుత్ ఒప్పందాల వల్ల రూ. 9,000 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ చార్జీలను పెంచకుండా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. సాగునీటి రంగాన్ని కూడా పునర్‌వ్యవస్థీకరించామని, రాష్ట్ర రిజర్వాయర్లలో 950 టీఎంసీల నీరు లభ్యమైందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ తిరిగి పెరుగుతోందని, పెట్టుబడులు క్రమంగా రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. ఇటీవల నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని, ఎస్ఐపీబీ ద్వారా రూ.8 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని వివరించారు. విద్యారంగం గతంలో అవ్యవస్థలోకి నెట్టబడిందని, పెండింగ్ బిల్లుల సమస్యలు వదిలివెళ్లారని విమర్శించిన ఆయన, కొత్త సంస్కరణలతో విద్యావ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నామని చెప్పారు. గ్రామీణ అభివృద్ధిలో భాగంగా పల్లెపండుగ వంటి కార్యక్రమాల ద్వారా మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం వదిలివెళ్లిన 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించడం పెద్ద సవాలుగా మారిందని, జనవరి 1 నాటికి చెత్త రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు కృషి కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.