ఉద్యోగుల వ్యక్తిగత జీవిత రక్షణకు రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు కీలకం

జనం న్యూస్ : ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే లోక్‌సభలో "రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు"ను ప్రవేశపెట్టారు. ఉద్యోగులకు సంబంధించిన ఓ ప్రైవేట్ బిల్లు డిసెంబర్ 5,2025న లోక్‌సభ ముందుకు వచ్చింది. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే లోక్‌సభలో "రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు"ను ప్రవేశపెట్టారు. ఉద్యోగుల పనిభారం తగ్గించి, పని తర్వాత వ్యక్తిగత సమయాన్ని కాపాడే ఉద్దేశ్యంతో ఈ బిల్లును రూపొందించారు. అసలేంటి " రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు " ఆఫీసు పనివేళలు పూర్తైన తర్వాత పనికి సంబంధించిన ఫోన్లు, మెయిల్స్ స్వీకరించకుండా ఉండే హక్కును ఉద్యోగులకు కల్పించే ఉద్దేశంతో " రైట్ టూ డిస్కనెక్ట్ అనే ప్రైవేట్ బిల్లు"ను రూపొందించారు. విధులు ముగిశాక, సెలవు రోజుల్లో కూడా ఉద్యోగులకు వారి ఆఫీసుల నుండి ఫోన్లు, మెయిల్స్ రావడం వలన వ్యక్తిగత, కుటుంబ జీవనానికి ఆటంకం కలుగుతోందని లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన ఎన్సీపీ ఎంపీ సుప్రియ పేర్కొన్నారు. పనివేళల తర్వాత ఆఫీసు పనికి సంబంధించిన కాల్స్, మెయిల్స్ స్వీకరించకుండా తిరస్కరించే హక్కు ఉద్యోగులకు కల్పించాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. ఈ హక్కును అమలు చేసేందుకు, ఉద్యోగుల సంక్షేమాన్ని పర్యవేక్షించేందుకు "ఉద్యోగుల సంక్షేమ సంస్థ"లను ఏర్పాటు చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలు వారి మొత్తం వేతన చెల్లింపులో 1% జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. ఏయే దేశాల్లో ఈ బిల్లును అమలు చేస్తున్నారు? ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం, ఇటలీ వంటి దేశాల్లో "రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు"ను అమలు చేస్తున్నారు. ఫ్రాన్స్ దేశం 2017లో ఈ చట్టాన్ని అమలు చేసింది, రైట్ టు డిస్కనెక్ట్ బిల్లును అమలు చేసిన మొట్టమొదటి దేశంగా నిలిచింది. ఈ చట్టం ప్రకారం 50 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీలు పనివేళలు ముగిసిన తర్వాత ఉద్యోగులు ఈమెయిల్స్ లేదా ఫోన్ కాల్స్‌కు స్పందించకుండా ఉండటానికి అనుమతించే నిబంధనలు రూపొందించారు. స్పెయిన్ దేశం 2018లో డేటా ప్రొటెక్షన్ చట్టంలో భాగంగా ఆ దేశంలో ఈ హక్కును చేర్చారు. 2022లో బెల్జియం దేశం కూడా ఇదే తరహా చట్టాన్ని అమలు చేసింది. రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు , చట్టంగా ఎప్పుడు మారుతుంది? రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు, కేంద్ర మంత్రి కాకుండా, పార్లమెంట్ సభ్యులు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇండియాలో ప్రైవేట్ మెంబర్స్ ప్రవేశపెట్టిన బిల్లు చట్టంగా మారిన సందర్భాలు చాలా తక్కువ. చర్చ తర్వాత ఉపసంహరించుకోవడం లేదా ప్రభుత్వ చట్టంగా మారుస్తామని హామీ ఇచ్చిన తర్వాత విత్‌డ్రా చేసుకోవడం జరుగుతుంది.