
సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణలో పంచాయితీ ఎన్నికల పోరు కొనసాగుతుంది. అయితే ఎన్నికల బరిలో నిలిచిన కొందరు సర్పంచ్ అభ్యర్థులు ఇస్తున్న హామీలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో పంచాయితీ ఎన్నికల పోరు కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా... తొలి విడతలో డిసెంబర్ 11న, రెండో విడతలో డిసెంబర్ 14న, మూడో విడతలో డిసెంబర్ 17న పోలింగ్ జరగనుంది. అయితే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కొందరు వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా కొందరు అభ్యర్థులు ఇస్తున్న హామీలు కూడా ఆసక్తికరంగా, ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఓ సర్పంచ్ అభ్యర్థి ఓట్లు పొందేందుకు వినూత్న హామీ ఇచ్చారు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ. 10 వేలు అందజేస్తానని తెలిపారు. వివరాలు... రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరెపల్లిలో మొదటి విడతలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచి అభ్యర్థి ఇటిక్యాల రాజు వినూత్న హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే గ్రామంలో పుట్టిన ప్రతి ఆడ శిశువు పేరుమీద రూ. 10 వేల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని తెలిపారు. బాలికల విద్య, వారి భవిష్యత్తుకు అండగా నిలిచే లక్ష్యంతో ఈ హామీ ఇచ్చానని రాజు తెలిపారు. గ్రామంలో ఆడపిల్ల పుడితే రూ. 10,000 అందజేస్తామని చెప్పడంతో చర్చనీయాంశంగా మారింది. మరి ఇటిక్యాల రాజు ఇచ్చిన హామీ వైపు ప్రజలు మొగ్గు చూపారా? లేదా? అనేది డిసెంబర్ 11వ తేదీన ఓట్ల లెక్కింపు తర్వాత తేలనుంది.