
జనం న్యూస్: తెలంగాణ పంచాయితీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పరీక్ష వాయిదా వేయాలనే అభ్యర్థనపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది.తెలంగాణ పంచాయితీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పరీక్ష వాయిదా వేయాలనే అభ్యర్థనపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. అయితే పరీక్ష షెడ్యూల్‌లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. వివరాలు... తెలంగాణలో మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తొలి దశ పోలింగ్ డిసెంబర్ 11న, రెండో దశ పోలింగ్ డిసెంబర్ 14న, మూడో దశ పోలింగ్ డిసెంబర్ 17న నిర్వహించనున్నారు. అయితే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష తేదీ డిసెంబర్ 14న ఉండటంతో... కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష తేదీ రోజునే(డిసెంబర్ 14) సర్పంచ్ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఉందని... అదే రోజు పరీక్ష జరిగితే తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా నిరోధిస్తుందని పిటిషనర్లు వాదించారు. అందువల్ల అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష తేదీని మరో తేదీకి వాయిదా వేసేలా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (TSLPRB)ని ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. అదే రోజు జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని అన్నారు. మరోవైపు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష నిర్వహించడానికి నిర్ణయించిన తేదీని మార్చరాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే ముందుగా నిర్ణయించిన నియామక సమయపాలనలో తేలికగా జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి లేదా పరీక్ష నిర్వహణపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. షెడ్యూలింగ్, లాజిస్టికల్ సర్దుబాట్లకు సంబంధించిన సమస్యలు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (TSLPRB) పరిపాలనా పరిధిలోకి వస్తాయని ధర్మాసనం పేర్కొంది.నియామక బోర్డుకు పిటిషనర్లను ప్రాతినిధ్యాన్ని సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు... వారి అభ్యర్థనను చట్టం ప్రకారం పరిశీలించి, వీలైనంత త్వరగా తగిన నిర్ణయం జారీ చేయాలని ఆదేశించింది.