భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్‌కి ప్రధాని మోదీ ఘన స్వాగతం

పయనించే సూర్యుడు న్యూస్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. భారత ప్రధాని మోదీ పాలం ఎయిర్‌పోర్టుకు చేరుకుని పుతిన్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మోదీ, పుతిన్‌లు ఒకే వాహనంలో అక్కడి నుంచి బయలుదేరారు. ఇక, ఎయిర్‌పోర్టులో భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా కళాకారులు నృత్యాలతో పుతిన్‌కు సంప్రదాయ స్వాగతం పలికారు. పుతిన్‌ పర్యటనలో భాగంగా రష్యా- భారత్‌ల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఈ పర్యటనలో పుతిన్... భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపునున్నారు. ఈ అధికారిక చర్చలకు ముందు ప్రధాని మోదీ తన నివాసంలో పుతిన్‌కు ప్రైవేట్ విందు ఇవ్వనున్నారు. శుక్రవారం (డిసెంబర్ 5) ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అధికారిక స్వాగతం పలకనున్నారు. అక్కడ రాష్ట్రపతి ముర్ము - పుతిన్ సమావేశం ఉండనుంది. ఇక, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగే 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పుతిన్, మోదీలు పాల్గొననున్నారు. అయితే పుతిన్ పర్యటన... ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా, దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహపడనుందని భావిస్తున్నారు. ఇక, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటించే ఢిల్లీని భద్రతా పరంగా హై అలర్ట్‌లో ఉంచారు. కఠినమైన భద్రతా నిబంధనల కారణంగా ఆయన బస చేసిన ఖచ్చితమైన ప్రదేశం వెల్లడించడం లేదని పోలీసులు తెలిపారు. పుతిన్ రాక నుంచి నిష్క్రమణ వరకు...ప్రతి కదలికను సంయుక్తంగా పనిచేసే బహుళ భద్రతా విభాగాలు ట్రాక్ చేస్తాయని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు. ఢిల్లీ పోలీసులు, కేంద్ర సంస్థలు, పుతిన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది సున్నితమైన ప్రదేశాలలో SWAT బృందాలు, ఉగ్రవాద నిరోధక విభాగాలు, స్నిపర్లు, త్వరిత-ప్రతిచర్య బృందాలతో సహా బహుళ-అంచెల భద్రతా గ్రిడ్‌ను ఏర్పాటు చేశాయి.