దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు ప్రారంభం

* మొదటి దశ 30 రోజుల్లో పూర్తయ్యేలా వేగవంతం * ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి కీలకం

పయనించే సూర్యుడు న్యూస్ : ఎట్టకేలకు దేశంలో జనగణనపై కేంద్రం బిగ్ అప్ డేట్ ఇచ్చింది. దేశంలో రెండు దశల్లో జనాభా లెక్కల సేకరణ నిర్వహించనున్నట్లు తెలిపింది. 2026లో మొదటి దశ.. 2027 రెండో దశ జనగణన జరుగుతుందని లోక్‌సభలో వెల్లడించింది. మొదటి దశలో హౌస్ లిస్టింగ్, సెన్సెస్.. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని పేర్కొంది. మంచు కురిసే ఉత్తర భారత రాష్ట్రాల్లో మొదట జనగణన చేపట్టనున్నట్లు.. ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని స్పష్టం చేసింది. దేశంలో రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న.. జనాభా లెక్కల సేకరణ కార్యక్రమానికి సంబంధించి.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో రెండు దశల్లో జనాభా లెక్కల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2026 ఏప్రిల్ నుంచి 2027 ఫిబ్రవరి వరకు రెండు దశల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. మంగళవారం లోక్‌సభకు తెలియజేసింది. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జనగణన ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని పేర్కొన్నారు. మొదటి దశలో హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ చేపట్టనున్నారు. ఆ తర్వాత రెండో దశలో పాపులేషన్ ఎన్యూమరేషన్ చేయనున్నారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య మొదటి దశ.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సౌలభ్యాన్ని బట్టి 30 రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఇక రెండో దశ విషయానికి వస్తే.. 2027 మార్చి 1వ తేదీని రిఫరెన్స్ తేదీగా తీసుకుని 2027 ఫిబ్రవరిలో పాపులేషన్ ఎన్యూమరేషన్ నిర్వహించనున్నారు. అయితే లడఖ్, జమ్మూ కాశ్మీర్‌లోని మంచుతో కూడిన ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాలకు మాత్రం 2026 అక్టోబర్ 1వ తేదీని రిఫరెన్స్ తేదీగా తీసుకుని 2026 సెప్టెంబర్‌లో లెక్కలు సేకరించనున్నారు. ఈసారి జనగణన డిజిటల్‌గా మొబైల్ యాప్ ద్వారా, ఆన్‌లైన్ సెల్ఫ్ కౌంటింగ్ ద్వారా నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. ఈసారి జనాభా లెక్కల్లో అత్యంత ముఖ్యంగా కుల గణనను కూడా చేరుస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ నిర్ణయం మేరకు కులాన్ని కూడా జనగణనలో చేర్చుతామని తెలిపారు. 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న జనగణన ప్రక్రియలో.. గతంలో జరిగిన ప్రక్రియల నుంచి నేర్చుకున్న పాఠాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి జనగణనను నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, జనగణన డేటా, వినియోగదారుల సూచనల ఆధారంగా ప్రశ్నలను ఖరారు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *