
సాక్షి డిజిటల్ న్యూస్: గోదావరి జిల్లాలలో కొబ్బరి చెట్లకు...గోదావరి జిల్లాలకు తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయని తెలంగాణ ప్రజాప్రతినిధులు భగ్గుమంటున్నారు. తెలంగాణ ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని...లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమాలు విడుదల చేయనివ్వం అని ప్రజాప్రతినిధులు హెచ్చరించారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించవద్దు అంటూ జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజకీయాల్లో నేతల ఆచితూచి మాట్లాడాలి.కాస్త అటు ఇటూ ఏమైనా తేడాగా మాట్లాడితే ఇక అంతే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య కూడా సున్నితమైన అంశాలపై కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.ఇరు రాష్ట్రాలమధ్య సెంటిమెంట్ అంశాలు ఉంటాయి. ఈ సెంటిమెంట్‌కు దెబ్బతీసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అది రెండు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయం మారిపోతుంది.ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణ ప్రజలను అవమానించేలా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని... తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేదంటే ఆయన సినిమాలను తెలంగాణలో ఆడనివ్వబోమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. ఇతర నేతలు అయితే తెలంగాణ నుంచి తరిమి తరిమి కొడతామంటూ పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏంటి..? రాజకీయ దుమారం పెరగడానికి కారణం ఏంటో ఓసారి తెలుసుకుందాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇవే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నవంబర్ 26న ఆంధ్రప్రదేశ్‌లోని డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహించిన పల్లెపండుగ 2.0లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకరగుప్తం మెజర్ డ్రెయిన్ లోంచి వస్తున్న సముద్రపు జలాల కారణంగా దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించి బాధిత రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోదావరి జలాలు అన్నపూర్ణగా భాసిల్లుతున్నాయి. రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే. ఆ శాపం తగిలినట్టుంది. కోనసీమ కొబ్బరి చెట్లతో పచ్చగా ఉంటుందని తెలంగాణ నాయకులు అంటుంటారు. నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు. ఇప్పుడు కొబ్బరి చెట్ల మొండేలు కూడా లేవు. వారి దిష్టి తగిలింది కోనసీమకు అంటూ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తెలంగాణ వారి దిష్టి తగలడం వల్లే కోనసీమ కొబ్బరి చెట్లు పాడవుతున్నాయనే అర్థంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడంపై మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్‌పై నేతల ఫైర్ నరదిష్టి వ్యాఖ్యలపై తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీమంత్రులు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సైతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడుతున్నారు. వీరిద్దరి మధ్యలోకి మెగాస్టార్ చిరంజీవిని సైతం తీసుకువస్తున్నారు. చిరంజీవి చాలా మంచివారని ఆయన బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడతారని కానీ పవన్ కల్యాణ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. కోనసీమకు తెలంగాణ ప్రజలు దిష్టి పెట్టారనడం అజ్ఞానం అని రాష్ట్ర ప్రజలకు పవన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే పవన్ సినిమాలు ఇక్కడ ఆడనివ్వమని తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హెచ్చరించారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ సినిమాలను ఆడనివ్వబోం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ వారి దిష్టి తగలడం వల్లే కోనసీమ కొబ్బరి చెట్లు పాడవుతున్నాయనే అర్థంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని...లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలను ఆడనివ్వబోమని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. ‘పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి. తెలంగాణ ప్రజల దిష్టి వల్ల కాదు, గత ఆంధ్ర పాలకుల వల్లే ఇక్కడి ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లు తాగారు. ఈ విషయం తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకుంటే సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా... తెలంగాణలోని ఒక్క థియేటర్‌లో కూడా ఆయన సినిమా విడుదల కాదు’ అని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవి ఒక సూపర్ స్టార్. ఆయన చాలా మంచి వ్యక్తి. కానీ పవన్ కల్యాణ్‌కు రాజకీయ అనుభవం లేనట్లుంది. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు.