జనం న్యూస్: రాష్ట్రంలో నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్‌న్యూస్ తెలిపారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో మూడు నెలలకు ఓసారి జాబ్ మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు. 2027 నాటికి గోదావరి పుష్కరాలకంటే ముందే పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల్లో పెన్షన్ల పంపిణీ కోసమే రూ.50,763 కోట్లు ఖర్చు చేశామని…దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో సంక్షేమం కోసం వ్యయం చేస్తున్న రాష్ట్రం మరొకటి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫష్టం చేశారు. పెన్షన్ల పంపిణీతో పేదల జీవితాల్లో వెలుగులు నింపామని అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే అవకాశం ప్రజలు తమకు ఇచ్చారని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే సూపర్ సిక్స్ విజయవంతంగా అమలు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గోపీనాథపట్నంలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తురాలు నాగలక్ష్మి ఇంటికి వెళ్లి పింఛను అందజేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనంతరం ప్రజా వేదిక సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పింఛన్ల పంపిణీలో రికార్డు సృష్టించాం. ‘ఈ నెల 14వ తేదీకి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు పూర్తి అవుతుంది. ఇప్పటి వరకూ పింఛన్ల కోసం రూ. 50,763 కోట్లు ఖర్చు చేశాం. ఏటా రూ.32,143 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.1 లక్షా 65 వేల కోట్లు పింఛన్ల కోసమే ఖర్చు చేస్తున్నాం. పొరుగు రాష్ట్రాలు తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, అతిపెద్ద రాష్ట్రం యూపీలోనూ ఈ స్థాయిలో అక్కడి ప్రభుత్వాలు వ్యయం చేయటం లేదు. 63 లక్షల పైచిలుకు మందికి రూ.2,739 కోట్లు పెన్షన్ల రూపంలో అందిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతీ వంద మందిలో 13 మందికి పెన్షన్లు అందిస్తున్నాం. ప్రతినెలా పింఛన్లు అందుకుంటున్న వారిలో 59 శాతంమంది మహిళలే. అంటే ఇప్పటి వరకు ఇచ్చిన రూ.50 వేల కోట్లలో రూ.30 వేల కోట్లు ఒక్క మహిళలకే ఇచ్చాం. గత ప్రభుత్వంలో భర్త చనిపోతే భార్యకు పింఛన్ అందలేదు. కూటమి ప్రభుత్వంలో ఆ ఇబ్బందుల లేవు. ఈ నెలలో కొత్తగా 7,533 మందికి రూ.3 కోట్లతో వితంతు పింఛన్లు ఇస్తున్నాం. గడిచిన ఐదేళ్లలో ఒక్క నెల పింఛను తీసుకోకపోయినా ఎగ్గొట్టేవారు. ప్రభుత్వంలో 2 నెలలుగా పెన్షన్ తీసుకోని 1,39,677 మందికి రూ.114 కోట్లు, 3 నెలలుగా పెన్షన్ తీసుకోని 13,325 మందికి రూ.16 కోట్లు విడుదల చేశాం. 1984లో ఎన్టీఆర్ పింఛన్లకు శ్రీకారం చుట్టారు. దాన్ని క్రమంగా పెంచుతూ ప్రస్తుతం రూ.4000 ఇస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా బాధ్యతగా ప్రతి నెలా ఒకటో తేదీన ఠంచనుగా పింఛను అందిస్తుంటే. గత ప్రభుత్వంలో ఐదేళ్లు ముక్కుతూ, మూలుగుతూ రూ.250 మాత్రమే పెంచారు’అని సీఎం చంద్రబాబు అన్నారు. అర్హులందరికీ సంక్షేమం వర్తింపు ‘ఓ వైపు సంక్షేమం అమలు చేస్తూనే మరో వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. జనాభా సమతౌల్యం కోసం ఆలోచన చేయాలి. అప్పుడే దేశం, రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తాయి. కానీ కాలక్రమంలో జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. దీపం-2 కింద ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పటి వరకు 2.85 కోట్ల సిలిండర్లు ఉచితంగా అందించాం. ఇందుకోసం రూ. 2,104 కోట్లు ఖర్చు చేశాం. స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సులో నేటి వరకు మహిళలు 25 కోట్ల ప్రయాణాలు చేశారు. గత ఐదేళ్లలో స్కూళ్లలో కనీసం సరిపడా టీచర్లు కూడా లేరు. కూటమి ప్రభుత్వం వచ్చాక మెగా డీఎస్సీతో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేశాం’అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు. ‘మరో 15 ఏళ్లు కూటమి అధికారంలో ఉండాలని మిత్రులు పవన్ కల్యాణ్ ఎప్పుడూ అంటుంటారు. ఇటీవల విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటికే రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే అందుకు ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయతే కారణం. దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాక రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం మొదటిసారి. ప్రతి నియోజకవర్గంలో మూడు నెలలకు ఓసారి జాబ్ మేళాలు నిర్వహిస్తాం. 2027 నాటికి గోదావరి పుష్కరాలకంటే ముందే పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం. పోలవరం పూర్తయితే నీటి ఎద్దడి ఉండదు. పొలాలకు రేట్లు పెరుగుతాయి. హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కోకాపేటలో ఎకరా రూ.10 వేలు ఉంటే నేడు రూ.160 కోట్ల వరకూ వెళ్లింది. అభివృద్ది జరిగితే భూముల ధరలు పెరుగుతాయి. కియా కార్ల పరిశ్రమ రాకతో అనంతపురం పెనుగొండ ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.