హైదరాబాద్ ప్రయాణికులకు పెద్ద రిలీఫ్

* మెట్రో విస్తరణకు నిధులు విడుదల! * మెట్రో కనెక్టివిటీ పనులకు రూ.125 కోట్లు విడుదల

జనం న్యూస్ : హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రైలు కనెక్టివిటీ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం రూ.125 కోట్ల నిధులను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో భాగంగా ‘మెట్రో కనెక్టివిటీ టూ ఓల్డ్ సిటీ’ పథకం కింద ఈ నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ జీఓ జారీ చేసింది. మంజూరైన ఈ మొత్తాన్ని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) ఖాతాకు మళ్లించనున్నారు. ఈ తాజా నిధుల విడుదల పాతబస్తీ మెట్రో విస్తరణ పనుల పురోగతికి దోహదపడనుంది. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ వాసుల చిరకాల కల నెరవేరే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఓల్డ్ సిటీ మెట్రో రైలు కనెక్టివిటీ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం రూ.125 కోట్లను విడుదల చేస్తూ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. మెట్రో కనెక్టివిటీని పాతబస్తీకి విస్తరించాలన్న లక్ష్యంలో భాగంగా.. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ‘మెట్రో కనెక్టివిటీ టూ ఓల్డ్ సిటీ’ పథకం కింద ఈ నిధులను కేటాయించడం జరిగింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (బడ్జెట్) శాఖ సోమవారం అధికారికంగా జీఓను జారీ చేసింది. మంజూరైన ఈ నిధులను సంబంధిత బడ్జెట్ కేటాయింపుల నుంచి విడుదల చేయాలని ప్రభుత్వం ట్రెజరీ శాఖ అధికారులను ఆదేశించింది. విడుదలైన మొత్తం రూ.125 కోట్లను నేరుగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఖాతాకు మళ్లించనున్నారు. పాతబస్తీ మెట్రో విస్తరణకు సంబంధించి గతంలో అనేకసార్లు ప్రకటనలు వచ్చినా.. తాజాగా నిధుల విడుదల జరగడం ఈ ప్రాజెక్టు పురోగతికి స్పష్టమైన సంకేతం. త్వరలోనే పనులు వేగవంతమై.. నిర్మాణ దశకు చేరుకోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. పాతబస్తీకి మెట్రో ప్రయోజనాలు.. మెట్రో కనెక్టివిటీ పాతబస్తీలోని లక్షలాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం సమస్యలకు మెట్రో ఒక శాశ్వత పరిష్కారం చూపనుంది. మెట్రో అందుబాటులోకి వస్తే.. పాతబస్తీ వాసులు నగరంలోని ఇతర ప్రాంతాలకు సులభంగా, వేగంగా చేరుకోగలుగుతారు. ఇది వారి ఉపాధి అవకాశాలను పెంచడంతోపాటు, స్థానిక వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. పాతబస్తీలోని చార్మినార్, ఇతర చారిత్రక కట్టడాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *