మీ ఓటు విలువను తగ్గించొద్దు

* ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్: గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మంచి వ్యక్తిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయిగ్రామ పంచాయితీ ఎన్నికల్లో మంచి వ్యక్తిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో నిర్వహించిన ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి… సర్పంచ్ ఎన్నికల గురించి ప్రస్తావించారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎవరి మాటలో నమ్మి, ఫుల్ కోసమో, హాఫ్ కోసమో ఓటు వేయద్దని కోరారు. ‘‘హాఫ్‌కో, ఫుల్‌కో ఓటు వేస్తే వాళ్లు పెట్టే గోస, తిప్పలు భరించలేం. ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసే మంచి మనుషులను సర్పంచ్‌లుగా ఎన్నుకోండి. మంచోళ్లు సర్పంచ్ అయితే ఊరు బాగుపడతది. మన సమస్యలు తెలిసి, మనతో తెలిసి, మన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేసే వ్యక్తులకు ఓటు వేయండి’’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాలకు నిధులు ఇచ్చే బాధ్యత, నీళ్లు ఇచ్చే బాధ్యత తనదని అన్నారు. గత పదేండ్లుగా నిర్లక్ష్యానికి గురైన నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడమే కాకుండా వచ్చే రెండేళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాలమూరు జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలను అందించి నిండు మనసుతో ఆశీర్వదించారని… పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది.. మోసం చేస్తే పాతాళానికి తొక్కుతుంది అని నిరూపించారని అన్నారు. ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా కెసీఆర్ ను ఈ గడ్డ ఆదరించిందని… కానీ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి సంగం బండను పగలగొట్టేందుకు రూ. 12 కోట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పాలమూరు జిల్లాలో పాడిపంటలు పండాలన్న లక్ష్యంతో దశాబ్ద కాలంగా పాతాళానికి తొక్కివేయబడిన జీవో 69 ను బయటకు తీయడమే కాకుండా నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల పనులను మొదలు పెట్టబోతున్నట్టు చెప్పారు. సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించడానికి నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం రైతుల కోసం 1.04 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించిందని చెప్పారు. ఉన్న కష్టాలను అధిగమిస్తూ, అప్పులు చెల్లించుకుంటూ వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఇక, మక్తల్ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుగా… పడమటి ఆంజనేయస్వామి వారి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నియోజకవర్గంలోని మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో రూ. 118.82 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *