పయనించే సూర్యుడు న్యూస్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ విపక్షాలకు కీలక సూచనలు చేశారు. చట్టసభలలో విపక్షాలు హుందాగా వ్యవహరించాలని సూచించారు. ప్రతీ అంశంపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. చట్టసభలలో సానుకూలమైన చర్చ జరినప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని చెప్పుకొచ్చారు. మరోవైపు విపక్షాలకు ఓటమిని అంగీకరించే మనసు లేదు అని ఎద్దేవా చేశారు. చట్టసభలలో డ్రామాలు వద్దని చట్టసభలలో చర్చలు తప్పనిసరి అని ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకొచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభ సమావేశమైన వెంటనే ఇటీవల మరణించిన సభ్యులకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి.అయితే కొత్త ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అధ్యక్షతన తొలిసారిగా రాజ్యసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ మీడియాతో మాట్లాడారు. దేశ ప్రగతి కోసం పార్లమెంటులో అర్థవంతమైన చర్చలు జరగాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అన్ని అంశాలపై సానుకూల చర్చలు జరుగుతాయని…జరగాలని ఆశిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. సభా సమయాల్లో డ్రామాలు వద్దని, చట్టసభల్లో చర్చలు తప్పనిసరని ప్రధాని నరేంద్రమోడీ హితవు పలికారు. పరాజయాన్ని అంగీకరించే మనసు ప్రతిపక్షాలకు లేదు మరోవైపు విపక్షాలపై ప్రధాని నరేంద్రమోడీ అసహనం వ్యక్తం చేశారు. పరాజయాన్ని అంగీకరించే మనసు ప్రతిపక్షాలకు లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.విపక్షాలకు రాజకీయమే ప్రధాన అజెండా అయితే ఎన్డీఏ ప్రభుత్వానికి మాత్రం దేశాభివృద్ధి మాత్రమే తమ ప్రధాన కర్తవ్యమని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని చట్టసభల్లో సమయానుకూలంగా చర్చలు తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు.దేశాభివృద్ధి కోసం విపక్షాలు కూడా తమతో కలిసి రావాలని ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించారు. దేశ అభివృద్ధి విషయంలో విపక్షాలను సైతం కలుపుకుని ముందుకు వెళ్తామని ప్రధాని తెలిపారు. దేశ ప్రగతి కోసం మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని విపక్షాలకు ప్రధాన నరేంద్రమోడీ విజ్ఞప్తి చేశారు. ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇదిలా ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 14 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు పలు ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు సైతం సిద్ధంగా ఉన్నాయి.ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అత్యంత కీలకమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్, ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు, అణు ఇంధనం, కార్పొరేట్, బీమా, జాతీయ రహదారుల సవరణ వంటి ముఖ్యమైన బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. వీటి ద్వారా పలు సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.మరోవైపు కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు, ఢిల్లీలో జరిగిన పేలుడు, జాతీయ భద్రత, పెరుగుతున్న కాలుష్యం, రైతులకు కనీస మద్దతు ధర వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇదే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు రాజ్యసభ ఛైర్మన్‌గా తొలిసారి సభా కార్యకలాపాలను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభించారు.ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా రాజ్యసభ సమావేశాలను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు.. గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ పలు రాష్ట్రాల్లో సేవలు అందించారు అని ప్రధాని మోడీ కొనియాడారు.సీపీ రాధాకృష్ణన్‌ను పార్టీ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా… సీపీ రాధాకృష్ణన్ వ్యక్తిత్వం, సహనం మనందరికీ ఆదర్శం అని ప్రధాని నరేంద్రమోడీ కొనియాడారు.కోయంబత్తూర్ బాంబు పేలుళ్ల ఘటనలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తృటిలో బయటపడ్డారు.. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేశారు అని ప్రధాని నరేంద్రమోడీ తెలియజేశారు.కొత్త ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడంలో రాధాకృష్ణన్ ముందుంటారు అని ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసించారు.