సాక్షి డిజిటల్ న్యూస్: ప్రతీ నెలా కోట్ల మంది ప్రజలతో ప్రధాని మోదీ తన మనసులో మాటను చెబుతున్నారు. తాజాగా మరోసారి దేశ ప్రజలకు ఆయన ప్రత్యేక పిలుపు ఇచ్చారు. మరి ఏం చెప్పారో తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇవాళ మన్‌కీ బాత్ 128వ ఎపిసోడ్లో భాగంగా ఆల్ ఇండియా రేడియోలో తన మనసులో భావాలను దేశ ప్రజలతో పంచుకున్నారు. నవంబర్ నెలలో రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ఆనందం కలిగించిందని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా వందే భారత్ 150 వసంతాల ఉత్సవాలు జరుపుకోవడం కూడా హర్షం కలిగించిందన్నారు. ఇంకా అయోధ్యలో రామ మందిరంపై ధ్వజ స్తంభం ప్రతిష్టంచడం సంతృప్తి కలిగించిందన్నారు. కొన్ని రోజుల కిందట తాను హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద లీప్ ఇంజిన్ MRO ఫెసిలిటీని ప్రారంభించానన్న మోదీ.. వైమానిక రంగంలో ఈ ఫెసిలిటీ అతి పెద్ద ముందడుగుగా ఆయన తెలిపారు. అలాగే ఇటీవల INS మహేను ముంబైలో.. భారతీయ నౌకా దళానికి అంకితం చేసినట్లు మోదీ తెలిపారు. అలాగే ఇటీవల హైదరాబాద్‌లో ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్కైరూట్ తయారుచేసిన రాకెట్.. భారత్‌ని సరికొత్త తీరాలవైపు నడిపిస్తోందని మోదీ వివరించారు. వ్యవసాయ రంగంలో దేశంలో 35.7 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసి భారత్ సరికొత్త రికార్డ్ నెలకొల్పిందని మోదీ వివరించారు. పదేళ్లలో ఈ దిగుబడి 10 కోట్ల టన్నులు పెరిగిందని తెలిపారు. క్రీడల్లో ఇటీవల భారత్ త్వరలో.. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించబోతోందనే ప్రకటన వచ్చిందనీ, ఇది దేశ ప్రజల విజయం అని మోదీ తెలిపారు. పుణెలో కొందరు కుర్రాళ్లు.. మార్స్ గ్రహంపై ఎగిరేందుకు వీలుగా, జీపీఎస్‌తో సంబంధం లేకుండా ఎగిరే డ్రోన్‌ని తయారుచేశారని మోదీ మెచ్చుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లో ప్రత్యేకమైన తేనెను తేనెటీగలు సులాయ్ (Sulai) పువ్వుల నుంచి సేకరిస్తున్నాయనీ.. దాన్ని రంబన్ సులాయ్ హనీ అని పిలుస్తారని మోదీ తెలిపారు.