
సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజాపాలన వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు.ఈ మేరకు ఆరు రోజులపాటు ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించారు. డిసెంబర్ 1 నుంచి 6 వరకు మక్తల్ నుంచి దేవరకొండ వరకు బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది.భారీ బహిరంగ సభలు నిర్వహించి, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే డిసెంబర్ 7న విరామం తీసుకుని డిసెంబర్ 8 నుంచి హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్ సమిట్‌కు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రజా పాలన రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ మెుదటి వారంలో పలు జిల్లాలలో పర్యటించనున్నారు. ప్రజాపాలన వారోత్సవాల పేరుతో జిల్లాల వారీగా సక్సెస్ టూర్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆరు రోజుల షెడ్యూల్ ఖరారు అయ్యింది. డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నుంచి డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండ వరకు షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ ప్రాంతాలలో భారీ బహిరంగ సభలను సైతం ఏర్పాటు చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సక్సెస్ టూర్‌లో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడంతోపాటు సంక్షేమ పథకాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. మరోవైపు డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ సమిట్’కు ముందే...రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకున్న సానుకూలతను చాటిచెప్పేలా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. భారీ బహిరంగ సభలు నిర్వహించి, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.డిసెంబర్ 1 నుంచి 6 వరకు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 7న ఒక్కరోజు విరామం తీసుకుని డిసెంబర్ 8 నుంచి హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్ సమిట్‌కు హాజరవుతారు. డిసెంబర్ 1 నుంచి 6 వరకు పర్యటనలు ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జిల్లాలలో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించనున్నారు.మక్తల్‌లో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’కు భూమి పూజ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే డిసెంబర్ 2న కొత్తగూడెంలో పర్యటించనున్నారు. అక్కడ ‘డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ’ని ప్రారంభించనున్నారు. 3న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సీఎం పర్యటన ఉంటుంది. కొత్త ఇంజనీరింగ్ కళాశాల భవనాలకు, హెచ్ఏఎం పద్ధ తిలో నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.అలాగే డిసెంబర్ 4న ఆదిలాబాద్‌లో, 5న వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. చివరిగా డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ఫ్లోరైడ్ రహిత నల్గొండలో పట్టణ తాగునీటి సరఫరా, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పురోగతిని ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ద్వారా తెలియజేయనున్నారు. అర్బన్ ప్రాంతాలలోనే బహిరంగ సభలు ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమలులో ఉంది. గ్రామీణ ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించేందుకు అనుమతులు ఉండవు. ఈ నేపథ్యంలో కోడ్ ప్రభావం లేని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పట్టణ కేంద్రాలను వేదికగా చేసుకుని ఈ పర్యటనలు చేపట్టనుంది. ఈ క్రమంలో ఎన్నికలు లేని మున్సిపాలిటీల ద్వారానే ప్రభుత్వం అమలు చేసిన ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాల లబ్ధిని గణాంకాలతో సహా ప్రజలకు ఈ టూర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు.ఈ బహిరంగ సభలలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ నాయకతవం అంతా ఒకే వేదిక పంచుకోవడం ద్వారా ఐక్యతను చాటడంతోపాటు కేడర్‌లో కొత్త జోష్ నింపే అవకాశం ఉంది.