వాట్సాప్ వెబ్ యూజర్లకు షాక్! త్వరలో భారీ మార్పు

* అవసర సమయంలో ఇబ్బంది? వాట్సాప్ వెబ్ మార్పు యూజర్లకు టెన్షన్

పయనించే సూర్యుడు న్యూస్ : కమ్యూనికేషన్ యాప్స్‌కు సంబంధించి కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. సిమ్ ఉంటేనే యాప్ పనిచేసేలా చూడాలంటూ కమ్యూనికేషన్ యాప్‌లకు టెలికమ్యూనికేషన్ విభాగం సూచనలు జారీ చేసింది. అలాగే వెబ్ బ్రౌజర్‌లలో లాగిన్ అయ్యి యాప్ సేవలు ఉపయోగిస్తూ ఉంటే.. ప్రతి ఆరు గంటలకూ లాగౌట్ అయ్యేలా చూడాలని సూచనలు చేసింది. దీని ద్వారా కమ్యూనికేషన్ యాప్స్ దుర్వినియోగం కావని అధికారుల ఉద్దేశం. ప్రస్తుత యుగంలో వాట్సాప్, టెలిగ్రామ్, షేర్ చాట్.. ఇవన్నీ అందరికీ నిత్యావసరాలుగా మారిపోయాయి. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఆండ్రాయిడ్ ఫోన్.. అందులో ఇలాంటి కమ్యూనికేషన్ యాప్స్ బోలెడు.. ఇవి చాలదన్నట్లు ల్యాప్‌టాపులు, కంప్యూటర్లలోనూ వెబ్ యాప్ ద్వారా వీటిని లాగిన్ చేసుకునే అవకాశం. వీటి ద్వారా 24 గంటలూ నిత్యం తీరికన్నదే లేకుండా సోషల్ మీడియాలో ఉంటారు యువతరం. అయితే అలాంటి వారికో ముఖ్య గమనిక. కమ్యూనికేషన్ యాప్స్‌కు సంబంధించి కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. డివైజ్‌లో సిమ్ కార్డు ఉంటేనే ఇలాంటి కమ్యూనికేషన్ యాప్ సర్వీసులు పనిచేసేలా చూడాలంటూ టెలికమ్యూనికేషన్స్ డిపార్టుమెంట్ సూచించింది. వాట్సాప్ , సిగ్నల్, స్నాప్ చాట్, టెలిగ్రామ్, షేర్ చాట్, జియో చాట్, అరట్టై, జోష్ వంటి కమ్యూనికేషన్ యాప్‌లను కేంద్రం ఈ సూచనలు చేసింది. కేంద్రం కొత్తగా తీసుకువస్తున్న టెలికమ్యూనికేషన్‌ సైబర్‌ సెక్యూరిటీ సవరణ నిబంధనలు, 2025లో భాగంగా ఈ ఆదేశాలను డిపార్టుమెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ విభాగం జారీ చేసింది. ఇక మారబోతుంది మీ వాట్సాప్ వెబ్ అనుభవం సాధారణంగా వాట్సాప్, షేర్ చాట్, స్నాప్ చాట్ వంటి కమ్యూనికేషన్‌ అప్లికేషన్లను.. టెలి కమ్యూనికేషన్‌ ఐడెంటిఫైర్‌ యూజర్‌ ఎంటింటీస్‌గా పేర్కొంటారు. అయితే టెలికమ్యూనికేషన్‌ సైబర్‌ సెక్యూరిటీ అమెండ్‌మెంట్ రూల్స్, 2025 ప్రకారం.. ఇలాంటి సంస్థలు 90 రోజుల పాటు తమ సర్వీసులతో సిమ్ కార్డులు అనుసంధానమయ్యేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి కమ్యూనికేషన్ యాప్స్ ఉపయోగించే యూజర్.. మొబైల్ ఫోన్‌లో కాకుండా బ్రౌజర్‌లో సేవలు ఉపయోగిస్తూ ఉంటే.. (అంటే వాట్సాప్ వెబ్ వంటి వాటి ద్వారా) సదరు ప్లాట్‌ఫామ్‌ ప్రతి 6 గంటలకు ఆ వెబ్ బ్రౌజర్ నుంచి లాగౌట్ అయ్యేలా చూడాల్సి ఉంటుంది. మళ్లీ సేవలు పొందాలంటే మరోసారి క్యూఆర్ కోడ్ ఉపయోగించి లాగిన్ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒకసారి వెబ్ వాట్సాప్ ద్వారా లాగిన్ అయితే అలాగే కొనసాగే వీలుంది. అయితే ఇలా ఉండటం వలన కమ్యూనికేషన్‌ యాప్స్‌ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సవరణలు ప్రస్తుతం ఎలా ఉందంటే వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ.. మరో కమ్యూనికేషన్ యాప్ ఏదైనా కానీ.. డివైజ్‌లోయాప్ ఇన్‌స్టాల్ చేసుకునే సమయంలో సిమ్ కార్డు అథెంటిఫికేషన్ అడుగుతోంది. ధ్రువీకరణ పూర్తైన తర్వాత ఆ డివైజ్‌ నుంచి సిమ్‌కార్డు తొలగించినా కూడా ఆ సేవలు అలాగే కొనసాగించుకునే వీలుంది. దీంతో విదేశాలలోనిసైబర్‌ నేరగాళ్లు ఇలాంటి కమ్యూనికేషన్ యాప్స్ వినియోగించుకోవడం సాధ్యమవుతోందని కేంద్రం భావిస్తోంది. అలా కాకుండా ఉండాలంటే సిమ్‌ బైండింగ్‌ నిబంధన అవసరమని యోచిస్తోంది. సిమ్ బైండింగ్ కారణంగా ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలు తగ్గుతాయని సైబర్‌ నిపుణులు చెప్తున్నారు. ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేదీ చూడాలి. అలాగే కమ్యూనికేషన్ యాప్స్ దీనిని ఎలా అమలు చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *