పయనించే సూర్యుడు న్యూస్ : రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి జోన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన సీఎం, రాజధాని ప్రాంత రైతులందరూ ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. “అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్‌గా ఏకమైతే, రైతులతో నిరంతర చర్చలు జరిపి వారి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తాం. రెండో దశ భూ సమీకరణ లాభాలను కూడా వివరంగా తెలియజేశాం” అన్నారు. అమరావతి కేవలం మున్సిపాలిటీగా మిగలకూడదు ప్రపంచస్థాయి మహానగరంగా రూపుదిద్దుకోవాలి, ఈ దిశగా రాజధాని అభివృద్ధి ఇప్పుడు ‘అన్‌స్టాపబుల్’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు – రైతుల సమస్యలపై హామీ రాజధాని భూములపై క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించినట్లు సీఎం తెలిపారు. కేంద్రం ఈ విషయంపై చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిధిలోని సమస్యలన్నీ క్రమంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాజధాని పరిసర ప్రాంతాల్లోని లేఅవుట్ల సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. భూ త్యాగం చేసిన రైతుల సమస్యలపై సీఎం గంభీరంగా స్పందించారు. రైతుల నుంచి ఎవరైనా అధికారులు డబ్బు డిమాండ్ చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పాలన అంశాల గురించి మాట్లాడుతూ, 2025 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. పారదర్శకమైన పాలన అందిస్తామని, అవినీతికి ఆస్కారం ఇవ్వబోమని సీఎం స్పష్టం చేశారు.