సాక్షి డిజిటల్ న్యూస్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఏకంగా 77 అడుగుల కాంస్య విగ్రహాన్ని గోవాలో ప్రారంభించారు. 550 ఏళ్ల మఠం సంప్రదాయాన్ని పురస్కరించుకుని.. అక్కడ కొన్ని రోజుల పాటు పలు కార్యక్రమాలు జరగనున్నాయి. అంతకుముందు ప్రధాని మోదీ.. కర్ణాటకలో పర్యటించి.. భగవద్గీత శ్లోకాలు పఠించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ .. ఇవాళ కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేశఆరు. ఈ సందర్భంగా ఉడుపిలో గీతా పారాయణ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత.. గోవా వెళ్లిన మోదీ.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దక్షిణ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠంలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 77 అడుగుల కాంస్య శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ శిల్పి రామ్ సుతార్ ఈ రాముడి విగ్రహాన్ని తయారు చేశారు. 550 ఏళ్ల మఠం సంప్రదాయాన్ని పురస్కరించుకుని నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఇక్కడ వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గోవాలో 77 అడుగుల రాముడి విగ్రహం ఆవిష్కరణ దక్షిణ గోవాలోని కనకోనా జిల్లా పార్టగల్ గ్రామంలో ఉన్న శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠాన్ని ఇవాళ ప్రధాని మోదీ సందర్శించారు. ఈ మఠం ప్రాంగణంలో ప్రతిష్ఠించిన 77 అడుగుల ఎత్తు కలిగిన శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠం.. భారతదేశంలోని అత్యంత పురాతన మఠాల్లో ఒకటి కావడం విశేషం. 370 సంవత్సరాల క్రితం పార్టగల్‌లో ఈ మఠాన్ని నిర్మించారు. ఈ మఠం 550 ఏళ్ల సంప్రదాయాన్ని పురస్కరించుకుని ప్రస్తుతం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉడుపిలో లక్ష కంఠ గీతా పారాయణ గోవా పర్యటనకు ముందు ప్రధాని మోదీ కర్ణాటకలోని ఉడుపిలో పర్యటించారు. ఉడుపి శ్రీ కృష్ణ మఠంలో జరిగిన లక్ష కంఠ గీతా పారాయణ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష మందికి పైగా భక్తులు, విద్యార్థులు, పండితులు పాల్గొనగా.. వారితో కలిసి ప్రధాని మోదీ భగవద్గీత శ్లోకాలను పఠించారు.