పయనించే సూర్యుడు న్యూస్ : రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై ట్రంప్ సుంకాలు విధిస్తున్న వేళ.. పుతిన్ భారత్‌లో పర్యటించనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాను దాటి పుతిన్ చాలా అరుదుగా బయటి దేశాల పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారత్‌కు వస్తుండటం గమనార్హం. భారత్, రష్యా మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం అవుతున్న వేళ.. పుతిన్ భారత పర్యటన ఆసక్తికరంగా మారింది. భారత్, రష్యా మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ఎట్టకేలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. డిసెంబర్ 4, 5వ తేదీల్లో 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం పుతిన్ భారత్‌లో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం అధికారికంగా ప్రకటన చేసింది. ఈ పర్యటనలో భాగంగా పుతిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరపనున్నారు. అదే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందులో పాల్గొననున్నారు. ఇటీవలి కాలంలో రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా భారత్‌పై ఆంక్షలు విధించడం, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అవుతున్న సమయంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించనున్నారు. భారత్-రష్యా మధ్య ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడంపై దృష్టి సారించనున్నారు. ఈ చర్చల్లో ఇంధన సహకారం, రక్షణ బంధాలు, వాణిజ్య విస్తరణతో పాటు ఉక్రెయిన్, ఇండో-పసిఫిక్ వంటి ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు కూడా ప్రధానంగా చర్చకు రానున్నాయి. చివరిసారి.. 2021 డిసెంబర్‌లో పుతిన్ భారత్‌లో పర్యటించారు. ఇక ఇదే పర్యటనలో భారత్, రష్యా మధ్య ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లకు సంబంధించి కూడా చర్చ జరగనుంది. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన ఐదు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో ఇప్పటికే 3 డెలివరీ కాగా.. మిగిలిన రెండు యూనిట్లు 2026, 2027లో డెలివరీ కావాల్సి ఉంది. వీటిని సకాలంలో డెలివరీ చేయడం గురించి చర్చించనున్నారు. వీటితోపాటు.. రష్యా తదుపరి తరం వ్యవస్థ అయిన ఎస్-500ను కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా పరిశీలించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఎస్-500 600 కిలోమీటర్ల వరకు బాలిస్టిక్ క్షిపణులను.. 400 కిలోమీటర్ల వరకు గాల్లోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలదు. ఇక ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 2 స్క్వాడ్రన్ల SU-57 జెట్‌లను కొనుగోలు చేసే అవకాశంపై వస్తున్న ఊహాగానాలపై ఇప్పటికే రక్షణ వర్గాలు స్పందించాయి. ఈ విషయంలో భారత్ అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నప్పటికీ.. SU-57 కొనుగోలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న ఏకైక నిజమైన ఐదో తరం ఫైటర్ జెట్ అమెరికాకు చెందిన ఎఫ్-35 మాత్రమేనని వర్గాలు స్పష్టం చేశాయి. తక్కువ ధరకు రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై ఇటీవల అమెరికా ఆంక్షల గురించి చర్చించినప్పటికీ.. భారత్ తన ఇంధన దిగుమతులు పూర్తిగా జాతీయ ప్రయోజనాలు, తక్కువ ధరలకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. ఇక ఈ శిఖరాగ్ర సమావేశం కోసం చేసిన ఏర్పాట్ల గురించి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ నెల మొదట్లోనే మాస్కోలో పుతిన్‌ను కలిసి వివరించారు. అలాగే.. ఇటీవలే రష్యా అధ్యక్షుడి సహాయకుడు నికోలాయ్ పట్రుషేవ్‌తో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాపై ఆంక్షలు విధిస్తున్న అమెరికా.. ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతున్న భారత్‌పైనా సుంకాల మోత మోగిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు పుతిన్ భారత్‌లో పర్యటించడంపై అగ్రరాజ్యం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ప్రాధాన్యం సంతరించుకుంది.