పయనించే సూర్యుడు న్యూస్ : అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు రెండో దశ భూసేకరణ తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పెట్టుబడులు, ఎయిర్పోర్టు, స్పోర్ట్స్సిటీ వంటి వాటికి భూములు అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో రెండో దశ భూసేకరణకు సంబంధించి చర్చించారు. 7 గ్రామాల పరిధిలో మరో 16,666 ఎకరాల భూసమీకరణకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర మంత్రివర్గం. ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి రెండోదశ భూసమీకరణ తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం (నవంబర్ 27) అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్పోర్టు, స్పోర్ట్స్సిటీ, రైల్వేస్టేషన్ నిర్మించేందుకు కూడా భూములు అవసరమని చెప్పారు. ఈ నేపథ్యంలో రెండో దశ భూసేకరణ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తీసుకుంది. 7 గ్రామాల పరిధిలో మరో 16,666 ఎకరాల భూసమీకరణకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చే ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ భూమితో కలిపి రెండో దశలో 20 వేల ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో భూసేకరణతో పాటు దాదాపు 25కుపైగా అజెండా అంశాలపై చర్చించారు. ఈ కేబినెట్ సమావేశంలో భూసేకరణ చేయబోయే ప్రాంతాలను పరిశీలించినట్లు సమాచారం. హరిశ్చంద్రపురం, వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, పెదమద్దూరు, పెదపరిమి వంటి ప్రాంతాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో భూ లభ్యత, రికార్డులు, యాజమాన్యం, అభ్యంతరాలు వంటి అంశాలపై అధికారులు నివేదికలు సమర్పించినట్లు చెబుతున్నారు. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెదమద్దూరులో 1,145 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు , వడ్డమానులో 1,913 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాలు, ఎండ్రాయిలో 2,166 ఎకరాలు సేకరించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. రైతుల వద్ద నుంచి సేకరించిన భూమితో పాటు ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూములతో కలిపి మొత్తం 20,494 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని సమాచారం. రాజధాని రైతులతో గురువారం సచివాలంలో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రెండున్నర గంటల పాటు సాగిన మీటింగ్లో రాజధాని అభివృద్ధికి రైతులు సహకరించాలని కోరారు. రైతులు సహకరించకపోతే.. అమరావతి ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుందని అన్నారు. ప్రతి చిన్న విషయానికి సోషల్ మీడియాకు ఎక్కి రచ్చ చేయొద్దని, అంతర్గత విభేదాలతో సమస్యను పెద్దది చేయొద్దని సున్నితంగా హెచ్చరించారు. అమరావతి రైతుల్లో జేఏసీలు ఎక్కువగా ఉన్నాయని.. అందులో ఐకమత్యం లేదన్నారు. అందరూ ఒకేతాటిపై నిలబడి అమరావతి అభివృద్ధి కమిటీగా ఏర్పడాలని చంద్రబాబు సూచించారు.