
సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో ‘‘పల్లె పండుగ 2.0’’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో ‘‘పల్లె పండుగ 2.0’’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘‘ప్రతి పల్లెకు సదుపాయం... ప్రతి కుటుంబానికి సౌభాగ్యం’ లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 4 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించినట్లే, పల్లె పండుగ 2.0లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో రూ. 6,787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రతి గ్రామాన్ని ఒక అభివృద్ధి చిహ్నంగా తీర్చిదిద్దే సంకల్పంతో ప్రధాని మోదీ సహకారంతో, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం శివకోడులో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని బుధవారం రోజున పవన్ కల్యాణ్ ప్రారంభించారు. పల్లె పండుగ తొలి దశకు సంబంధించి చేపట్టిన పనులు ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పవన్ కల్యాణ్ తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... తాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పల్లెల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా రూపొందించిన అద్భుత కార్యక్రమం పల్లె పండుగ అని తెలిపారు. గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఈ కార్యక్రమం గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతో ప్రణాళికబద్దంగా ముందడుగు వేసి గొప్ప విజయం సాధించామని తెలిపారు. పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ పల్లె పండుగ 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పవన్ కల్యాణ్ తెలిపారు. పల్లె పండుగ 1.0 కార్యక్రమం ద్వారా రూ. 2,525 కోట్ల విలువైన పనులు టైం బౌండ్ విధానంలో పూర్తి చేశామని.. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించామని... పాడి రైతుల కోసం 22,500 మినీ గోకులాలు ఏర్పాటు చేశామని... మూగజీవాల దప్పిక తీర్చడానికి 15 వేల నీటి తొట్టెలు నిర్మించామని.. లక్షకు పైగా నీటి కుంటలు ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పుడు పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా రూ. 5,838 కోట్ల అంచనా వ్యయంతో 8,571 కిలోమీటర్ల కొత్త రహదారులు నిర్మించనున్నట్టుగా పవన్ కల్యాణ్ తెలిపారు. పాత రహదారులకు పునర్నిర్మాణం చేయబోతున్నామని... రూ. 375 కోట్ల వ్యయంతో 25 వేల మినీ గోకులాలు, రూ. 16 కోట్ల అంచనాతో 157 కమ్యూనిటీ గోకులాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే రూ. 4 కోట్ల వ్యయంతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.