జీహెచ్ఎంసీ విస్తరణకు కేబినెట్ ఆమోదం

పయనించే సూర్యుడు న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విస్తరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విస్తరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల-బయట, ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీ, కార్పొరేషన్లను)ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వివరాలు… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంగళవారం (నవంబర్ 25) రోజున కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట, ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీ, కార్పొరేషన్లను) GHMC లో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్ లకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ 27 ప్రాంతాలు… పెద్ద అంబర్‌పేట్, దమ్మాయిగూడ, తెల్లాపూర్, జల్‌పల్లి, నాగారం, అమీన్‌పూర్, శంషాబాద్, పోచారం, బడంగ్‌పేట్, తుర్కయంజల్, ఘట్‌కేసర్, బండ్లగూడ జాగీర్, మణికొండ, గుండ్లపోచంపల్లి, మీర్‌పేట్, నార్సింగి, తూంకుంట, బోడుప్పల్, ఆదిభట్ల, కొంపల్లి, పీర్జాదిగూడ, తుక్కుగూడ, దుండిగల్, జవహర్‌నగర్, మేడ్చల్, బొల్లారం, నిజాంపేట్. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొత్తగా 27 మున్సిపాలిటీ, కార్పొరేషన్లు విలీనంతో… జీహెచ్ఎంసీలో డివిజన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. డివిజన్ల సంఖ్య పెంపుతో పాటు విస్తీర్ణం కూడా పెరిగిన నేపథ్యంలో జీహెచ్ఎంసీని విభజిస్తారా? లేదా అలాగే ఉంచుతారా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే, రాష్ట్రంలో ఇప్పుడున్న ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్… రెండు డిస్కమ్లతో పాటు కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటు చేసేందుకు ఈ రోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచి నీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ సీవరేజ్ బోర్డ్ పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కమ్ పరిధిలోకి వస్తాయి. అలాగే, రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్, రాబోయే పదేండ్లకు అవసరమయ్యే విద్యుత్తు సరఫరా, విద్యుత్తు ఉత్పత్తి అంచనాలను కేబినేట్ సమగ్రంగా చర్చించింది. విద్యుత్తు విభాగం అధికారులు సమగ్రంగా సమర్పించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను పరిశీలించింది. పునరుత్పాదక విద్యుత్తు వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3,000 మెగా వాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *