
సాక్షి డిజిటల్ న్యూస్: తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న టీటీడీ పాలకమండలిపై విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న టీటీడీ పాలకమండలిపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘‘తిరుమల కేవలం ఒక ఆలయం కాదని... మన తిరుమల కేవలం ఒక ఆలయం కాదు; అది మన భక్తికి మూలం, మన ప్రగాఢ ప్రార్థనలతో అక్కడికి వెళ్తాము. గత ప్రభుత్వ హయాంలో (2019–24) అంచనా ప్రకారం 10.97 కోట్ల మంది భక్తులు (మీ కుటుంబం, మీ పొరుగువారు, మనమందరం) సందర్శించారు. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి - ప్రతిరోజూ 60,000 మంది భక్తులు పవిత్ర ఆలయాన్ని సందర్శించారు. సాధారణ సామాన్యుడి నుంచి భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తితో సహా అత్యున్నత రాజ్యాంగ ప్రముఖుల వరకు... పరిశ్రమల దిగ్గజాలు, క్రీడలు, కళలు, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనం భక్తితో నమస్కరిస్తున్నప్పుడు..మునుపటి టీటీడీ బోర్డు, దాని అధికారులు మన హృదయాలను విచ్ఛిన్నం చేశారు. వారు మన భక్తికి ద్రోహం చేశారు. ఒక అవకాశాన్ని మాత్రమే చూశారు. ప్రతి ఒక్క భక్తుడు మోసపోయాడు. వారు నియమాలను ఉల్లంఘించలేదు. మనం వారిపై ఉంచిన పవిత్ర నమ్మకాన్ని వారు విచ్ఛిన్నం చేశారు. వారు మన విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేశారు’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, పవన్ కల్యాణ్ సోమవారం ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రూ. 3.5 కోట్ల దేవాదాయ శాఖ నిధులతో ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న ప్రదక్షణ మండపానికి, రూ. 3.7 కోట్ల పంచాయతీరాజ్ రోడ్ అసెట్స్ నిధులతో ఐఎస్ జగన్నాథపురం గ్రామం నుంచి ఆలయానికి వెళ్లేందుకు నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసి, శిలాఫలకాలు ఆవిష్కరించారు. దీంతో పాటు ఇప్పటికే ఆర్ అండ్ బి శాఖ సహాయంతో పొంగుటూరు, లక్కవరం మధ్య గోతుల మయంగా ఉన్న రహదారికి రూ.1.5 కోట్లతో మరమ్మతులు చేయించగా... ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈ రహదారిని పవన్ కల్యాణ్ పరిశీలించారు.