
పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో పాలనను కుటుంబ స్థాయికి బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పౌర సేవలు, ప్రభుత్వ విభాగాల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (FBMS) అమలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నూతన వ్యవస్థలో భాగంగా, వచ్చే ఏడాది జూన్ 2026 నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఆధునిక స్మార్ట్ ఫ్యామిలీ కార్డు జారీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన గడువు విధించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం, ఈ కొత్త వ్యవస్థ కోసం సమాచార సేకరణ రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) నిర్వహిస్తున్న డేటా లేక్ నుంచి జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న 1.4 కోట్లకు పైగా కుటుంబాలకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ఫ్యామిలీ కార్డులు అందజేయడమే లక్ష్యం. ఈ స్మార్ట్ కార్డు 25 కీలక వివరాలతో పాటు 'పీ–4' వంటి సమగ్రమైన ఫ్యామిలీ ప్రొఫైల్ అంశాలను కూడా కలిగి ఉంటుంది. RTGS వద్ద ఉన్న డేటాను ప్రామాణికంగా తీసుకుని ఇతర ప్రభుత్వ శాఖలు వినియోగించుకునేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమగ్ర కార్డు ద్వారా అనేక ముఖ్యమైన డేటా ట్రాక్ అవుతుంది. ఇందులో వాక్సినేషన్ వివరాలు, ఆధార్ లింకేజీ, FBMS ఐడీ, కుల ధృవీకరణలు, పౌష్టికాహార డేటా, రేషన్ కార్డు సమాచారం, స్కాలర్‌షిప్‌లు, పెన్షన్లు ఇతర పథకాల వివరాలు ఉంటాయి. ఇప్పటివరకు కేవలం పెన్షన్లు లేదా రేషన్ కార్డు సమాచారంపై మాత్రమే ఆధారపడే పాత విధానాన్ని విస్తరించి, పౌరుడికి సంబంధించిన అన్ని డేటాను సమగ్రంగా నమోదు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ డేటా అనుసంధానం ద్వారా సుపరిపాలన లక్ష్యాలను సాధించవచ్చు. సుపరిపాలన లక్ష్యంతో రూపొందుతున్న ఈ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి పౌరుడు సరైన పథకాన్ని సమయానికి అందుకోగలరని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ల ద్వారా కుటుంబ వివరాలు నిరంతరం అప్‌డేట్ అయ్యేలా ఈ వ్యవస్థ పనిచేయాలని అధికారులకు సూచించారు. ఒకే కార్డు ద్వారా మొత్తం సమాచారం అందుబాటులో ఉండటం వల్ల పథకాల పంపిణీలో లోపాలు తగ్గుతాయని, లబ్ధిదారులకు పారదర్శకంగా పథకాలు అందుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.