పయనించే సూర్యుడు న్యూస్ : పుట్టపర్తి శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సత్యసాయి సేవా మార్గాన్ని ప్రశంసించారు. NACINలో సివిల్ సర్వీసెస్ పాత్రను వివరించారు. పుట్టపర్తి సత్యసాయి సందేశం ప్రపంచానికి ఆదర్శమని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. పుట్టపర్తిలోని హిల్‌వ్యూ స్టేడియంలో ఆదివారం శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా వచ్చి ప్రసంగించారు. సత్యసాయిబాబా ఆధ్యాత్మిక బోధనలు ప్రపంచవ్యాప్తం అయ్యాయని ఉపరాష్ట్రపతి కొనియాడారు. సత్యసాయిబాబా సేవా మార్గానికి ప్రతీకగా నిలిచారు. ఆయన పేదలకు నిస్వార్థ సేవలు అందించారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని నమ్మి ఆచరించారు. ప్రపంచమంతా ప్రేమను పంచారు. లక్షలాది మందిని సేవా మార్గంలో నడిపించారు అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
ఉచిత సేవలు తాగునీటి ప్రాజెక్టుల ద్వారా కోట్లాది మందికి సాయం : సత్యసాయి ట్రస్ట్ సేవా కార్యక్రమాల ద్వారా లక్షల మందికి త్రాగునీరు అందించారు. అనేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు స్థాపించి పేదలకు ఉచిత వైద్య సేవలు ఇస్తున్నారు. తమిళనాడులోని చెన్నై తాగునీటి ప్రాజెక్టు ద్వారా కోట్ల మంది ప్రజల దాహం తీర్చారు. దేశం విదేశాల్లో సత్యసాయి సిద్ధాంతాలు ఆచరణలో ఉన్నాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో సత్యసాయి ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్‌కు లక్షలాది మంది వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు ఉపరాష్ట్రపతి తెలిపారు.
సాయి సందేశం ప్రపంచానికి ఆదర్శం : ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సాయిబాబా జీవితం ఆయన సందేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం బాబా సేవా స్ఫూర్తిని మరోసారి ప్రపంచానికి చాటింది. ‘వికసిత్ భారత్’ సాధనలో సివిల్ సర్వెంట్ల పాత్ర కీలకం: రాధాకృష్ణన్ : ఉపరాష్ట్రపతి నేడు ఆంధ్రప్రదేశ్‌లోని పలాసముద్రంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ & నార్కోటిక్స్ (NACIN)లో సివిల్ సర్వీసెస్ అధికారి శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త NACIN క్యాంపస్‌ను ప్రారంభించడాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ఈ సంస్థ కస్టమ్స్ జీఎస్‌టీ పరిపాలనలో సామర్థ్యాన్ని పెంపొందించే అగ్రగామి కేంద్రంగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవడంలో సివిల్ సర్వెంట్ల పాత్ర గురించి మాట్లాడుతూ, చివరి మైలు వరకు సేవలను అందించడం, సమష్టి కృషితో పనిచేయడం అందరినీ కలుపుకొని పోయే అభివృద్ధి ముఖ్యం అని నొక్కి చెప్పారు. వ్యక్తిగత ప్రతిభ కన్నా బృంద ప్రతిభకే ప్రాధాన్యత ఇవ్వాలని నిరంతర అభ్యాసం సంస్కరణ-ఆధారిత ఆలోచన అవసరం అని అధికారులకు సూచించారు. ఏఐ (AI), ఎన్‌ఎల్‌పీ (NLP), ఎంఎల్ (ML), బ్లాక్‌చెయిన్ వంటి నూతన సాంకేతికతలను శిక్షణార్థులు అందిపుచ్చుకోవాలని ఉపరాష్ట్రపతి ప్రోత్సహించారు. పారదర్శకత సామర్థ్యం పౌర సేవలను అందించడంలో సాంకేతికత అపార అవకాశాలను కల్పిస్తుందని ఆయన అన్నారు. ఐజీఓటీ కర్మయోగి ప్లాట్‌ఫామ్ ఎప్పుడైనా ఎక్కడైనా సామర్థ్యాన్ని పెంచడానికి అద్భుతమైన వేదిక అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మంత్రులు నారా లోకేష్ ఉపరాష్ట్రపతి కార్యదర్శి అమిత్ ఖరే NACIN డైరెక్టర్-జనరల్ డాక్టర్ సుబ్రమణ్యం ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.