సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. రోడ్ల నిర్మాణం కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు చేయనుంది. రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం లాంటివి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన రెండేళ్ల కాలంలోనే రోడ్ల నిర్మాణం కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖా మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. రహదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 89 వేల కోట్ల విలువైన ప్రణాళికలను సిద్ధం చేసింన్నారు. రూ. 60,799 కోట్ల విలువైన పనులకు ఇప్పటికే అన్ని రకాల అనుమతులు లభించాయన్నారు. మరో రూ. 28 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రతిపాదనల దశలో ఉన్నాయని తెలిపారు. ఈ భారీ పెట్టుబడితో రాష్ట్రంలోని రోడ్ల వ్యవస్థ పూర్తిగా ఆధునికీకరించబడుతుందని డిప్యూటీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలన్న మహత్తర లక్ష్యంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ అనువైన వాతావరణ పరిస్థితులు, కీలక భౌగోళిక స్థానం, అత్యంత నైపుణ్యం గల మానవ వనరులు అందుబాటులో ఉండడం తమకు కలిసొచ్చే అంశాలని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలోని ప్రధాన జిల్లాలు అన్నీ కనెక్ట్ అవుతాయని చెప్పారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుంచి రీజినల్ రింగ్ రోడ్ (RRR) వరకు నిర్మించనున్న 39 రేడియల్ రోడ్ల మధ్య కొత్త పారిశ్రామిక పార్కులు రానున్నట్లు వెల్లడించారు. సుమారు 30 వేల ఎకరాల్లో ఈ అత్యాధునిక ‘ఫ్యూచర్ సిటీ’ ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ, అంతర్జాతీయ క్రీడా మైదానాలు, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేంద్రాలకు అవసరమైన అత్యాధునిక మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని చెప్పారు. ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని బందర్ పోర్టు వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ హైవేకు అన్ని అనుమతులు లభించాయన్నారు. ఇది లాజిస్టిక్స్ రంగానికి బూస్ట్ ఇవ్వనుందని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. అందరి సహకారంతో ‘తెలంగాణ రైజింగ్-2047’ కార్యక్రమాల్లో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.