జీ20 వేదికపై మోదీ కీలక సూచనలు

*ప్రపంచ నేతల దృష్టి భారత్‌పై!

సాక్షి డిజిటల్ న్యూస్: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ… ప్రపంచ అభివృద్ధి వ్యూహాలను పునఃపరిశీలించాలని పిలుపునిచ్చారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికపై మరోసారి కీలక ప్రసంగం చేశారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 నాయకుల సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ… ప్రపంచ అభివృద్ధి వ్యూహాలను పునఃపరిశీలించాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో సమ్మిళిత, స్థిరమైన వృద్ధిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అలాగే, ఈ సందర్భంగా ఆయన మూడు కీలక కార్యక్రమాలను ప్రతిపాదించారు. పర్యావరణ సమతుల్యత, సాంస్కృతికంగా సుసంపన్నమైన, సామాజికంగా సమగ్రమైన జీవన విధానాలను పరిరక్షించేందుకు జీ20 కింద గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీని ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. ‘‘ఎవరినీ వెనుకబడి ఉంచకుండా సమ్మిళిత, స్థిరమైన ఆర్థిక వృద్ధి’’ అనే సెషన్‌లో ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ… ‘‘మన అభివృద్ధి పారామితులను పునఃసమీక్షించడానికి, సమ్మిళిత, స్థిరమైన వృద్ధిపై దృష్టి పెట్టడానికి ఇప్పుడు సరైన సమయం. భారతదేశ నాగరిక విలువలు… ముఖ్యంగా సమగ్ర మానవతా సూత్రం ముందుకు సాగడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది’’ అని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ముఖ్యంగా ఫెంటానిల్ వంటి అత్యంత ప్రమాదకరమైన పదార్థాల వ్యాప్తి అనే సవాలును అధిగమించడానికి… మాదక ద్రవ్య-ఉగ్రవాద సంబంధాన్ని ఎదుర్కోవడానికి G20 ఇన్షియేటివ్‌ను భారతదేశం ప్రతిపాదిస్తోందని మోదీ చెప్పారు. ‘‘దౌర్భాగ్యమైన మాదకద్రవ్య-ఉగ్రవాద ఆర్థిక వ్యవస్థను బలహీనపరుద్దాం’’ అని ఆయన అన్నారు. ‘అన్ని విధాలా వృద్ధి చెందాలనే మన కలని సాకారం చేసుకోవడానికి నేను కొన్ని ఆచరణాత్మకమైన అంశాలను ప్రతిపాదించాను. వాటిలో మొదటిది జీ20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీని సృష్టించడం. భారతదేశానికి ఈ విషయంలో గొప్ప చరిత్ర ఉంది. మంచి ఆరోగ్యం, శ్రేయస్సును మరింత పెంచడానికి ఇది మన సమిష్టి జ్ఞానాన్ని అందించడానికి సహాయపడుతుంది’’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్) పోస్ట్ చేశారు. ఆఫ్రికా అభివృద్ధి ప్రపంచ పురోగతికి చాలా ముఖ్యమని ఆయన అన్నారు. జీ20 ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ ఇన్షియేటివ్‌ను ప్రతిపాదించారు. ‘‘భారతదేశం ఎల్లప్పుడూ ఆఫ్రికాకు సంఘీభావంగా నిలబడింది. భారతదేశ జీ20 అధ్యక్షత సమయంలోనే ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యునిగా మారడం నాకు గర్వకారణం’’ అని మోదీ పేర్కొన్నారు. రాబోయే దశాబ్దంలో ఆఫ్రికాలో 1 మిలియన్ సర్టిఫైడ్ శిక్షకులను సృష్టించడం మన సామూహిక లక్ష్యం కావాలని అన్నారు. అలాగే, G20 గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఆయన ప్రతిపాదించారు. ‘‘ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో మనం కలిసి పనిచేసినప్పుడు మనం బలంగా ఉంటాము. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన మోహరించడానికి సిద్ధంగా ఉన్న తోటి జీ20 దేశాల నుండి శిక్షణ పొందిన వైద్య నిపుణుల బృందాలను సృష్టించడం మన ప్రయత్నంగా ఉండాలి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *