మత్స్యకారులకు హామీ ఇచ్చిన ప్రభుత్వం

జనం న్యూస్: గంగపుత్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఉని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.మత్స్యకారులు ఆక్వా ఫార్మర్లు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని అభివర్ణించారు. మత్స్య ఉత్పత్తి పెంపు, ఆధునిక సాంకేతికత ప్రొత్సాహం కూటమి ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ‘స్థిరత్వం, సమతుల్యత, నాణ్యత. నీలి విప్లవం సాధించే మార్గం. అంతర్జాతీయ పోటీకి ఆక్వా రంగాన్ని సిద్ధం చేసే ప్రణాళికలు’అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగపుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖమంత్రి అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మత్స్యకారుల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ ధ్యేయమని, గంగపుత్రుల జీవనోపాధి, వారి కుటుంబాల భద్రత కోసం కూటమి ప్రభుత్వం అచంచల కట్టుబాటుతో పనిచేస్తోందని తెలిపారు.సముద్రాలు, నదులు, చెరువులు లాంటి ప్రకృతి సంపదలపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న లక్షలాది కుటుంబాల కోసం కూట‌మి ప్రభుత్వం సంపూర్ణ కట్టుబాటుతో పనిచేస్తోంది. మత్స్య ఉత్పత్తిని అభివృద్ధి చేయడమే కాక, ఈ రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు, మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించేందుకు, ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. స్థిరత్వం, సమతుల్యత, నాణ్యత ఈ మూడు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టే చర్యల ద్వారానే నీలి విప్లవం నిజస్వరూపం దాల్చుతుంది. రాష్ట్రంలో ఆక్వా రంగం మరింత పురోగమించేలా, అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామ‌ని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

వేట నిషేధకాలంలో ప్రభుత్వం రూ.10వేలు

‘మత్స్యకారుల పట్ల ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం మాట నిలబెట్టుకుని...వేట నిషేధకాలంలో గత ప్రభుత్వం ఇచ్చిన రూ.10,000 భృతిని కూటమి ప్రభుత్వం రూ.20,000కు పెంచినట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 1,29,178 మత్స్యకార కుటుంబాలకు మొత్తం రూ.259 కోట్ల ఆర్థిక లాభం కల్పించామని పేర్కొన్నారు. కేవలం వేట నిషేధ కాలంలో ఆర్థిక సాయం ఇవ్వడం మాత్రమే కాకుండా, వలసలు వెళ్లే మత్స్యకారులకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. దీర్ఘ తీరరేఖ కలిగిన రాష్ట్రం కావడంతో తీరం అభివృద్ధి ద్వారా మత్స్యకార కుటుంబాలకు స్థిరమైన ఆర్థిక భద్రత కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

ఆక్వారైతులకు విద్యుత్ టారిఫ్ తగ్గించాం

ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మత్స్య పరిశ్రమ సమగ్ర అభివృద్ధే లక్ష్యమని, కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ఆక్వా రంగానికి ఊతమిచ్చే విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆక్వా రైతులకు విద్యుత్ టారిఫ్ తగ్గించి, రంగం అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. తీవ్ర తుఫానులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మత్స్యకారుల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం ముందస్తు చర్యలు, హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేసినట్లు తెలిపారు. మత్స్య సంపద ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అగ్రస్థానంలో నిలబడటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఇందుకు అనుగుణంగా వ్యాపార అవ‌కాశాల వృద్ధికి అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్నామ‌ని. తీర ప్రాంత ప్ర‌జ‌లు త‌మ ప‌రిధిలో వీటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అన్నారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యంపై శ్ర‌ద్ధ‌వ‌హించి, సామాజిక ఆర్థిక రంగాల‌లో ఉన్న‌తి సాధించాల‌ని కోరారు. సముద్రమే జీవనోపాధిగా చేసుకున్న గంగపుత్రుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని.. వారి అభివృద్ధి, భద్రత, ఆత్మగౌరవం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు అని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖమంత్రి అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు.