పయనించే సూర్యుడు : ప్రజారోగ్యంలో సంజీవని ప్రాజెక్టు దేశానికే ఓ దిక్సూచి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.‘2026 ఏప్రిల్ 1 నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలతో ప్రజలకు ప్రయోజనం…త్వరగా అందుబాటులోకి తేవాలి అని సీఎం దిశానిర్దేశం చేశారు. వైద్య కళాశాలలు పూర్తయితే గ్రామీణ ప్రాంతాలకూ ఆధునిక వైద్యం అందించవచ్చు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిన చేపడుతున్నా… పర్యవేక్షణ, అజమాయిషీ మాత్రం ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైన సేవలు అందించేందుకు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడించారు. వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సమీక్షలో భాగంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్శల్ హెల్త్ స్కీంపై అధికారులతో సమీక్షించారు. పీపీపీ కింద తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రక్రియ ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో భాగంగా నాలుగు దశలు దాటామని… వచ్చే నెలాఖరు నాటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీలు ‘పీపీపీ విధానంలో చేపడుతున్న వైద్య కళాశాలల ద్వారా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అందే ఆధునిక వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకూ అందుతాయి’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలకు, విద్యార్ధులకు అంతిమంగా మొత్తం సమాజానికి ఈ మెడికల్ కాలేజీలతో ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం 50 ఎకరాలు కేటాయించాం. ఈ 50 ఎకరాల్లో 25 ఎకరాలు మెడికల్ కాలేజీ, ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలి. మిగిలిన 25 ఎకరాల్లో నర్సింగ్, పారామెడికల్, డెంటల్ లాంటి ఆయుర్వేద, వెల్ నెస్ సెంటర్, యోగా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఇంటిగ్రేట్ చేయాలి. ఆస్పత్రుల్లో 70 శాతం మేర పడకలు పేదలకు ఉచితంగా కేటాయిస్తున్నాం. అలాగే వైద్య సేవలు కూడా ఉచితంగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ మోడళ్లల్లో నిర్వహిస్తున్న ఆస్పత్రులు ఉన్నాయి. వాటిని ఆధ్యయనం చేయండి. రోగుల మెరుగైన, నాణ్యమైన సేవలు సులభంగా అందాలి. ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ఈ వైద్య కళాశాలలు పనిచేసేలా చూడాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్న ఆస్పత్రులకు రేటింగ్ ఇవ్వాలి. నీతి ఆయోగ్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రమాణాలు, నిబంధనలు ఉండాలి’ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కోన్నారు.