“అరటి గెలలు రోడ్డు పాలైతే రైతు సంక్షేమం ఎక్కడ? షర్మిల సూటి ప్రశ్న”

జనం న్యూస్: రాష్ట్రంలో అరటి రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. సిరులు కురిపించే అరటి పంట నేడు రైతన్న కంట కన్నీరు తెప్పిస్తోంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రైతును అరటి పంట ముంచుతుంటే రైతన్నల ఆక్రందనను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అని షర్మిల మండిపడ్డారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరటి రైతుల అరణ్య రోదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.‘సిరులు కురిపించే పంట నేడు రైతన్న కంట కన్నీరు తెప్పిస్తుంది. అన్నదాతను అరటి పంట ముంచుతుంటే... రైతన్నల ఆక్రందన కూటమి ప్రభుత్వానికి పట్టక పోవడం సిగ్గుచేటు’అని వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శలు గుప్పించారు.‘టన్నుకు 28 వేల నుంచి వెయ్యికి పడిపోయి రైతులు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఉన్నట్లా ? లేనట్లా ? అని పీసీసీ చీఫ్ నిలదీశారు.అసలు ఏపీలో ఉద్యానవన శాఖ పని చేస్తుందా.. మొద్దు నిద్ర పోతుందా ? అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎగుమతులు ఎందుకు తగ్గాయో పరిశీలించండి

‘ఆరుగాలం కష్టించి పండించిన అరటి గెలలను పశువులకు మేతగా పడేస్తుంటే ఇక రాష్ట్రంలో ఎక్కడుంది రైతు సంక్షేమం ?. లక్షల్లో పెట్టుబడికి వేలల్లో ఆదాయమైతే రైతు సుభిక్షంగా ఎలా ఉంటాడు ?’అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అరటికి కిలో ధర రూ.1 పెట్టే కూటమి ప్రభుత్వం రైతన్నకు చేసింది దగానే అని మండిపడ్డారు. అరటి రైతుల బాధలు విని వారిని ఆదుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడుని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిలదీశారు.‘అరటి రైతుల బాధలను వినండి.. ధరల పతనంపై సమీక్ష జరపండి. గల్ఫ్, యూరప్ దేశాలకు ఎందుకు ఎగుమతులు తగ్గాయో.. పరిశీలించి తక్షణం ఎగుమతులు ప్రారంభించండి. రైతుకు టన్నుకు కనీసం 25 వేలు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు చేపట్టండి’అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబు నాయుడును కోరారు.