భారత్ నా తల్లి ప్రాణాలు కాపాడింది

★మోదీకి రుణపడి ఉంటాను: షేక్ హసీనా కుమారుడు

సాక్షి డిజిటల్ న్యూస్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష పడిన నేపథ్యంలో, ఆమె కుమారుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం వల్లే తన తల్లి ప్రాణాలతో ఉందని తెలిపారు. తన తల్లిని హత్య చేసే కుట్రను భారత్ అడ్డుకుందని ఆయన తెలిపారు. ఇండియా తన తల్లికి నమ్మకమైన మిత్రదేశమన్నారు. అలానే ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ మార్పు కోసం నిధులు వెచ్చించిందని కూడా ఆయన ఆరోపించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్.. మరణశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. మరణశిక్ష విధించిన నేపథ్యంలో హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్.. భారత్‌కు విజ్ఞప్తి చేసింది. కానీ ఇండియా దీనిపై ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే తాజాగా హసీనా కుమారుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం వల్లే తన తల్లి ప్రాణాలతో ఉందని చెప్పుకొచ్చాడు. తన తల్లిని చంపేందుకు చేసిన కుట్రను నిరోధించిన ఘనత ఇండియాదే అంటూ ప్రశంసించారు. మీడియాతో ట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇండియా నా తల్లి ప్రాణాలను కాపాడింది. భారత్ మాకెప్పుడు నమ్మకమైన మిత్ర దేశంగానే ఉంటుంది. నాతల్లిని హత్య చేసేందుకు జరిగిన కుట్రను భారత్ నిరోధించి.. సంక్షోభ సమయంలో మా అమ్మ ప్రాణాలు కాపాడింది. ఆ అమ్మ బంగ్లాదేశ్ నుంచి ఇండియా వెళ్లకపోయి ఉంటే.... మిలిటెంట్లు ఆమె హత్యకు కుట్రలు చేసేవారు. కానీ అదృష్టవశాత్తు మా అమ్మ ఇండియా వెళ్లడం వల్ల తన ప్రాణాలు నిలిచాయి. నా తల్లి ప్రాణాలు కాపాడినందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని’ అని చెప్పుకొచ్చారు. గత సంవత్సరం విద్యార్థులు ఆందోళనకు దిగడం.. ఆ తర్వాత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాన పీఠం నుంచి దిగిపోయారు. ఆ వెంటనే అనగా 2024, ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు చేరుకున్నారు. అప్పటి నుంచి ఆమె దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రాంతంలో రహస్యంగా తలదాచుకుంటున్నారు. విద్యార్థుల ఆందోళన అణచివేసేందుకు గాను ఆమె తీసుకున్న చర్యలపై.. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారంటూ ఆమె మీద అనేక కేసులు నమోదయ్యాయి. వీటిపై వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ రెండు రోజుల క్రితం ఆమెను దోషిగా తేల్చి, మరణశిక్ష విధించింది. అయితే ఈ కేసుల విచారణ సమయంలో ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం న్యాయ ప్రక్రియను సరిగా పాటించలేదని హసీనా కుమారుడు విమర్శించారు.