సాక్షి డిజిటల్ న్యూస్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండురోజులపాటు ఏపీలో పర్యటించనున్నారు. నవంబర్ 20, 21 తేదీలలో తిరుపతిలో రాష్ట్రపతి పర్యటించనున్నారు. నవంబర్ 21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం నవంబర్ 22న శ్రీ సత్యసాయి జిల్లాలోని శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలకు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము పాల్గొంటారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారు అయ్యింది. నవంబర్ 20న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతి జిల్లాకు రానున్నారు. నవంబర్ 20,21 రెండురోజులపాటు ఆమె తిరుపతి పర్యటనలో ఉండనున్నారు. ఢిల్లీ నుంచి నవంబర్ 20న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3.15గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 3.55 నుంచి 4.30 గంటల మధ్య తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సాయంత్రం 5.20 గంటలకు తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుంటారు. రాత్రికి ద్రౌపది ముర్ము అక్కడ బస చేయనున్నారు.
నవంబర్ 21న తిరుమల శ్రీవారి దర్శనం
ఇకపోతే నవంబర్ 21వ తేదీ ఉదయం 9.30 గంటలకు శ్రీ వరాహ స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 10.50 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి ఉదయం 11.50 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నాం 12 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు పయనం అవుతారు. 22న సత్యసాయి జిల్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము: మరోవైపు నవంబర్ 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు.శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ కూడా శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ 19న ప్రధాని నరేంద్రమోడీ శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలలో పాల్గొననున్నారు.ఈ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రపతి సహా వివిధ ప్రముఖులు హాజరుకానున్న దృష్ట్యా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పుట్టపర్తికి ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, పట్టణాన్ని సుందరంగా అలంకరించాలని సీఎం సూచించారు. ఏర్పాట్ల పర్యవేక్షించేందుకు మంత్రుల కమిటీ పుట్టపర్తిలో పర్యటించాలని ఆదేశించారు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.